నుహ్ లో బుల్డోజ‌ర్ల‌తో అక్ర‌మ నిర్మాణాల‌ కూల్చివేత

హ‌ర్యానాలోని నుహ్ జిల్లాలో గురువారం హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్న ప్రాంతానికి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అక్ర‌మ నిర్మాణాల‌ను అధికారులు కూల్చివేశారు. బుల్డోజ‌ర్ల‌తో టౌరు ప్రాంతంలో ఉన్న క‌ట్ట‌డాల‌ను తొల‌గించారు.  నుహ్‌లో అల్ల‌ర్ల‌కు పాల్ప‌డిన వ్య‌క్త‌ల‌కు చెందిన నిర్మాణాలై ఉంటాయ‌ని భావిస్తున్నారు. హ‌ర్యానా ముఖ్యమంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ఆదేశాల మేర‌కు బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేత జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.
గ‌తంలో అస్సాంలో ఉన్న బంగ్లాదేశ్‌కు చెందిన‌ అక్ర‌మ శ‌ర‌ణార్థులు ఇటీవ‌ల హ‌ర్యానాలోని అర్బ‌న్ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారు.  నుహ్ జిల్లాలోని టౌరు టౌన్‌లో ఉన్న మొహ‌మ్మ‌ద్ పుర్ రోడ్డు మార్గంలో ఆ గుడిసెల‌ను నిర్మించారు. ఒక్క ఎక‌రంలోనే అక్క‌డ సుమారు 250 గుడిసెల్ని క‌ట్టారు. దాదాపు నాలుగేళ్ల నుంచి అక్క‌డ వాళ్లు ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. భారీ భ‌ద్ర‌త మ‌ధ్య బుల్డోజ‌ర్ల‌తో ఆ నిర్మాణాల‌ను తొల‌గించారు.  స్థానిక పోలీసుల‌తో పాటు పారామిలిట‌రీ ద‌ళాలు కూడా ఆ స‌మ‌యంలో ప‌హారా కాశాయి. ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన అధికారులు కూడా ప‌ర్య‌వేక్ష‌ణ చేశారు.

కాగా,  నుహ్ జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్ వ‌రున్ సింగ్లాను బదిలీ చేశారు. ఆయ‌న్న బివానికి పంపించారు. ఆయన స్థానంలో ఐపీఎస్  న‌రేంద్ర బిజ‌ర్నియాను కొత్త ఎస్పీగా నియ‌మించారు. నుహ్‌లో అల్ల‌ర్లు జ‌రిగిన వారం రోజుల్లోనే ఆయ‌న్ను బ‌దిలీ చేశారు. వ‌రుణ్ సింగ్లా 2017 ఐపీఎల్ బ్యాచ్ అధికారి. ఆయ‌న‌ది హ‌ర్యానా కేడ‌ర్‌. అయితే నుహ్‌లో హింస చోటుచేసుకున్న స‌మ‌యంలో ఆయ‌న లీవ్‌లో ఉన్న‌ట్లు తెలిసింది.మ‌సీదుల్లో శుక్ర‌వారం ప్రార్ధ‌న‌లు ర‌ద్దు

హర్యానాలో  హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రిగిన ప్రాంతాల్లోని మ‌సీదుల్లో శుక్ర‌వారం ప్రార్ధ‌న‌లు ర‌ద్దు చేశారు. ప్ర‌జ‌లు ఇండ్ల‌లోనే నమాజ్ చేసుకోవాల‌ని కోరారు. నుహ్‌, గురుగ్రాం స‌హా హ‌రియాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఇటీవ‌ల జ‌రిగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌ల్లో ఆరుగురు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అల్ల‌ర్లు చెల‌రేగిన నుహ్‌, గురుగ్రాం స‌హా ఇత‌ర ప్రాంతాల్లో పెద్ద‌సంఖ్య‌లో పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.  హింస ప్ర‌జ్వ‌రిల్లిన ప్రాంతాల్లోని మ‌సీదుల వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

హింస‌తో అట్టుడికిన గురుగ్రాంలో శుక్ర‌వారం ప్రార్ధ‌న‌లు ర‌ద్దు చేశామ‌ని న‌గ‌ర ముస్లిం కౌన్సిల్ పేర్కొంది. ప్ర‌జ‌లు ఇండ్ల‌లోనే న‌మాజ్ చేసుకోవాల‌ని అభ్య‌ర్ధించింది. ఈనెల 1న కొంద‌రు దుండ‌గులు గురుగ్రాం సెక్టార్ 57లోని ఓ మ‌సీదును ద‌గ్ధం చేసి ఇమాంను హ‌త్య చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.  ఇక వీహెచ్‌పీ ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్భంగా అల్ల‌ర్లు చెల‌రేగిన నుహ్‌లోనూ మ‌సీదుల వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. శుక్ర‌వారం ప్రార్ధ‌న‌లు ఇండ్ల‌లోనే ముగించాల‌ని ప్ర‌జ‌ల‌కు అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు.