నాదెండ్లను తెనాలి అభ్యర్థిగా ప్రకటించి టీడీపీకి పవన్ షాక్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలుపుబాట పట్టాలని ఎదురుచూస్తున్న తెలుగు దేశం పార్టీకి దూకుడుగా వ్యవహరిస్తున్న పవన్ వ్యవహారం కలవరం కలిగిస్తోంది. ఇప్పటి వరకు పొత్తులు సంబంధించి ప్రాథమిక చర్చలు కూడా జరగకుండానే తెనాలి నుండి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రధాన ప్రతిపక్షంకు పవన్ షాక్ ఇచ్చినట్లయింది.

ఉభయ గోదావరి జిల్లాలో `వారాహి విజయ యాత్ర’కు లభించిన అనూహ్య ప్రజా స్పందన తర్వాత పవన్ కళ్యాణ్ దూకుడుగా అడుగులు వేస్తున్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల పొత్తు గురించి ఎక్కువగా మాట్లాడకుండా అధికారంలోకి రావడమే లక్ష్యంగా స్పష్టం చేస్తున్నారు. మరోవంక ఎన్డీయే సమావేశంకు హాజరు కావడం ద్వారా బిజెపితో పొత్తు విషయంలో స్పష్టతతో వ్యవహరిస్తున్నట్లు వెల్లడి చేశారు.

ఇప్పటి వరకు తాను పోటీచేయబోయే నియోజకవర్గంనే ప్రకటించని పవన్ తెనాలి అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అభ్యర్థుల ఎంపిక విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నట్లు సంకేతం ఇచ్చారు. తద్వారా వైసీపీతో పాటు టిడిపికి జనసేన వ్యూహం అంతుపట్టకుండా పోతుంది.

 జనసేనలో నం 2గా భావిస్తున్న నాదెంద్ల మనోహర్ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనను తెనాలి అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా ఆ సీటులో గెలుపు తమదే అంటూ భరోసా కూడా వ్యక్తం చేశారు. నిజానికి ఈ సీటులో టీడీపీకి బలమైన నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు. 

ఆయనకు 2019 ఎన్నికల్లో 70 వేల దాకా ఓట్లు వచ్చాయి. అదే జనసేన నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ కి 25 వేల లోపు వచ్చాయి. పొత్తు కనుక ఉన్నా కూడా ఆలపాటి రాజావే ఈ సీటు నుంచి పోటీ చేస్తారని  టిడిపి వర్గాలు ధీమాతో ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ చొరవ తీసుకుని మరీ పొత్తుల కంటే ముందుగానే తమ అభ్యర్ధిని ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

గత ఎన్నికలలో జనసేన ఒకే ఒక సీటు గెలుపొందగా, అక్కడ గెలుపొందిన అభ్యర్థి ఎన్నికలు కాగానే అధికార పక్షంలో చేరిపోయారు. అందుకనే ఈ తడవ అటువంటి పొరపాటు జరగకుండా తమకు ముఖ్యమైన నాయకులు కీలకమైన నియోజకవర్గాలలో పోటీ చేసే విధంగా చూడటం ద్వారా 2024 ఎన్నికల అనంతరం ఏపీలో జనసేన రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా మారాలని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

తాము 15 నుండి 20 సీట్లను, అవికూడా తాము గెలిచే అవకాశాలు లేని సీట్లను వదిలి వేయడం ద్వారా జనసేనతో ఎన్నికల పొత్తు ఏర్పరచుకోవచ్చని చూస్తున్న టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించడం మింగుడు పడటం లేదు. టిడిపి లేకపోయినా ఎన్నికల్లో  తన ప్రాబల్యం చూపేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు వెల్లడి అవుతుంది.

పైగా, పలు సందర్భాలలో ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామని, అప్పటి వరకు నియోజకవర్గాలలో తమ పార్టీని బలోపేతం చేసుకోవడం పట్ల దృష్టి సారిస్తున్నామని పవన్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఎన్నికల పొత్తు అంటూ పెట్టుకుంటే ఒక బలమైన స్థానం నుండి పెట్టుకోవాలని పవన్ భావిస్తుండటంతో టిడిపి నేతలలో అభద్రతాభావంకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటె ఆ విధంగా జరిగితే పలువురు ప్రముఖ టిడిపి నేతలు తమ సీట్లను కోల్పోవలసి వస్తుంది.