బిజెపిలో చేరిన సహజ నటి జయసుధ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేశారు. జయసుధకు పార్టీ కండువ కప్పి సభ్యత్వ రశీదును తరుణ్ చుగ్ అందిచారు. పార్టీ చేరిక కార్యక్రమంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. 
 
అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సినీ నటి జయసుధ సమావేశమయ్యారు. పార్టీలో చేరే అంశంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. అన్ని వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని జయసుధకు అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది.

పార్టీలోకి జయసుధ రావడం సంతోషంగా ఉందని, అమెకు స్వాగతం పలుకుతున్నానని తరుణ్ చుగ్ తెలిపారు.  300 సినిమాల్లో నటించిన ఆమె, 2010 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారని చెప్పారు. 9 నంది అవార్డులతో పాటు 7 ఫిల్మ్‌ఫేర్, లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు అందుకున్నారని తరుణ్ చుగ్ గుర్తు చేశారు. బీజేపీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవలందిస్తారని ఆయన ఆకాంక్షించారు. 

బీజేపీలో చేరినట్లు జయసుధ చెబుతూ మోదీ  నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని, బీజేపీలో చేరాలని ఏడాది కాలం నుంచి అనుకుంటున్నానని  తెలిపారు. మతం, కులం పరంగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని బీజేపీలో చేరానని ఆమె స్పష్టం చేశారు.

“జయసుధకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నా. జయసుధ చేరిక పార్టీకి మరింత ఉత్సాహం కలిగిస్తుంది. కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలనా రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆరెస్ ఓడిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బస్తీల అభివృద్ధిపై జయసుధకు చిత్తశుద్ధి ఉంది.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

“ప్రధాని విధానాలు నచ్చి బీజేపీలో చేరుతున్నారు. ప్రధాని నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. సంవత్సరం నుంచి చర్చలు జరుగుతున్నాయి. అమిత్ షాను కలిశా. పని చేయాలనే తపనతోనే బీజేపీలోనే చేరుతున్నా. జయసుధగా, ప్రజలకు మంచి చేయాలనే జాతీయ పార్టీలో చేరాను. క్రైస్తవుల గొంతు వినిపిస్తూనే ఉంటా.” అని బీజేపీ జయసుధ చెప్పారు.

ఆమె తొలుత 1998లో తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే ఆ సమయంలో టిడిపి ర్యాలీలో బాణాసంచా పేల్చడాన్ని బాంబులుగా భయపడి, ఆమె స్పృహ తప్పినట్లయ్యారు. దానితో ఆ తర్వాత ఆమె రాజకీయాల వైపు చూడలేదు.

అయితే, 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానంపై కాంగ్రెస్ లో చేరి, సికింద్రాబాద్ నుండి అసెంబ్లీకి పోటీచేసి గెలుపొందారు. 2014లో ఓటమి చెందడంతో మౌనంగా ఉంటూ వచ్చారు. 2016లో టిడిపిలో, ఆ తర్వాత 2019లో వైసిపిలో చేరినా ఆ రెండు పార్టీలు ఆమెకు ఎటువంటి పాత్ర కల్పించకపోవడంతో ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.