నుహ్‌లో పాక్ అనుకూల నినాదాలతో రెచ్చిపోయిన గుంపు

హర్యానాలోని నుహ్‌ జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. విశ్వ హిందూ పరిషత్, తదితర సంస్థల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన జలాభిషేక యాత్రపై దుండగులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు ఈ ఎఫ్ఐఆర్ తెలిపింది. 

ఓ వర్గానికి చెందిన దాదాపు 800 నుంచి 900 మంది ‘‘పాకిస్థాన్ జిందాబాద్’’, ‘‘అల్లా హు అక్బర్’’ అనే నినాదాలు చేస్తూ, ఈ యాత్రలో పాల్గొన్న భక్తులపై దాడి చేసినట్లు పేర్కొంది. ఈ ఎఫ్ఐఆర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, జలాభిషేక యాత్ర సోమవారం నల్హర్‌లోని శివాలయం నుంచి ప్రారంభమైంది. 

ఈ శివాలయం పరిసరాల్లోని గుట్టలు, ఇళ్ల వద్ద నుంచి సుమారు 900 మంది దుండగులు ‘‘పాకిస్థాన్ జిందాబాద్’’, ‘‘అల్లా హు అక్బర్’’ అనే నినాదాలు చేస్తూ, ఈ శివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ దుండగుల వద్ద కర్రలు, రాళ్లు, అక్రమాయుధాలు ఉన్నాయి. యాత్రలో పాల్గొన్న భక్తులను చంపాలనే ఉద్దేశంతో వీరంతా దాడులు చేశారు.

భక్తులపైనా, శివాలయంపైనా ఈ దుండగులు రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరారు. వీరిని నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, వీరు వెనుకంజ వేయలేదు. యాత్రలో పాల్గొన్న భక్తులపై దాడులను కొనసాగించారు. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ, అక్రమాయుధాలతో కాల్పులు జరిపారు. 

పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం ఈ దుండగులు వాహనాలను ధ్వంసం చేసి, తగులబెట్టారు. ఈ యాత్రలో పాల్గొనడానికి వచ్చిన భక్తులు కార్లలో దాక్కుని కూర్చున్నట్లు కనిపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. లుఖ్మన్, వాజిద్, సాహిల్, ఝక్కర్, మరికొందరు ఈ హింసాకాండకు కుట్ర పన్నారు. 

పోలీసులపై కూడా పెట్రోలు బాంబులను విసిరారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ మత ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 9.30 గంటల వరకు నాలుగు జిల్లాల్లో 83 కేసులను నమోదు చేసి, 165 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ ఫిర్యాదుపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో దాడి చేసిన వారి వద్ద మారణాయుధాలు ఉన్నట్లు తెలిపారు. వారు రాళ్లతో రోడ్లపై అడ్డంకులు సృష్టించి, పోలీసులపై రాలు త్రవ్వి, కాల్పులు జరిపారు. రాళ్లతో, కర్రలతో, ఇనుప రాడ్ లతో పోలీసులపై దాడి చేయడంతో పాటు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోనులు, సంచులను లాక్కున్నారు. పోలీసులు తమను కాపాడుకోవడం కోసం గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది.