
వైఎస్ జగన్ ప్రభుత్వంకు ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై కోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణం వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం అమరావతి ఆర్-5 జోన్‌లో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ పిటిషన్లపై ఇరువైపుల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడించేందుకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పును రిజర్వ్ చేయగా, గురువారం తీర్పును వెల్లడించింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్‌కి సంబంధించి సీఆర్డీఏ చట్టాన్ని సవరించి యాక్ట్ 13/2022, జీవో 45ని తీసుకొచ్చారు.
మొత్తం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో పేదల కోసం మొత్తం 25 లే అవుట్‌లలో 50,793 మందికి ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
అలాగే గత నెల 24న నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేశారు. ఇంతలో హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులకు బ్రేకులు పడ్డాయి. హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది.
More Stories
మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో
గుంటూరు ఆసుపత్రిలో జిబిఎస్ తో ఓ మహిళ మృతి
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత