జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య

 
* జయంతి సందర్భంగా సంస్మరణ

అఖండ భారతావనిలో సగర్వంగా ఆవిష్కృతమయ్యే అత్యున్నత జాతీయ పతాకం మువ్వన్నెల జెండా. మన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ప్రతిరోజూ సమున్నతంగా ఎగురవేసి వందనం సమర్పిస్తున్నాము.  భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామం – చల్లపల్లి మండలం యార్లగడ్డ. తల్లిదండ్రులు పింగళి  హనుమంతరాయుడు, వెంకటరత్నం దంపతులు. 
 
1878 ఆగస్ట్ 2వ తేదీన ఆ పుణ్యదంపతులకు వెంకయ్య జన్మించారు. ఆయన అమ్మమ్మ, తాతయ్యలు సీతమ్మ, చలపతిరావుల స్వగ్రామం మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి. చలపతిరావు పెదకళ్లేపల్లిలో ఠానేదారుగా పనిచేసేవారు. అక్కడే తన అమ్మమ్మ ఇంటిలో జన్మించిన వెంకయ్య ఐదేళ్ల వయసు వచ్చే వరకూ వారివద్దనే పెరిగారు.
 
పెద్దకళ్లేపల్లిలోని పాఠశాలలో తొలి అడ్మిషన్ పొందారు. అక్కడే ఓనమాలు దిద్దారు. తర్వాత చలపతిరావుకు మొవ్వ మండలం భట్లపెనుమర్రుకు బదిలీ కావటంతో అక్కడే ప్రాధమిక విద్య, మచిలీపట్నంలోని హిందూ హైస్కూల్లో ప్రాధమికోన్నత విద్యను అభ్యసించారు. పింగళి వెంకయ్య గారి తాత నుంచి తండ్రి, బాబాయిలు అత్యధికులు యార్లగడ్డ గ్రామానికి కరణాలుగా సేవ చేశారు.

పామర్రు గ్రామ కరణం కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకున్న వెంకయ్యకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు కలిగారు. కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మీ, కుమారులు పింగళి పరశురామయ్య, పింగళి హేరంబా వెంకట చలపతిరావు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంకయ్య తన 19వ యేట సైన్యంలో చేరేందుకు ముంబై వెళ్ళారు. 

 
సైన్యంలో చేరి ఆఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే జాతిపిత మహాత్మాగాంధీని కలుసుకున్నారు. కొంతకాలానికి దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలటంతో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చేశారు. ప్లేగు వ్యాధి నివారణ చర్యల అధికారిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తించారు.

జపాన్, ఉర్దూ భాషల్లో మంచి పట్టు

పింగళి వెంకయ్య నిరంతర విద్యా పిపాస. విజ్ఞానాభిలాషతో ఆయన లాహోర్లోని డీ.ఏ.వీ కళాశాలలో చేరి, ఇంగ్లీష్ పాటు జపాన్, సంస్కృతం, ఉర్దూ భాషలు అభ్యసించారు. ఉర్దూ, జపనీస్ భాషల్లో ఆయన చక్కని వక్త. తనకు జపాన్ భాష నేర్పిన ప్రొఫెసర్ గోటేకు వెంకయ్య తెలుగు భాష నేర్పించారు. 

 
జపాన్ భాష అనర్గళంగా మాట్లాడుతుండటంతో పెద్దలు ఆయనను జపాన్ వెంకయ్య అని పిలిచేవారు. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో సభ్యుల కోరిక మేరకు ఆయన గంటసేపు ఉర్దూలో ప్రసంగించారు. వ్యవసాయరంగంలో పింగళి వెంకయ్య చేసిన కృషి తెలుసుకుని బందరులో జాతీయ కళాశాల (నేషనల్ కాలేజ్) వ్యవస్థాపకులు కోపల్లె హనుమంతరావు మునగాల వెళ్లి నాటి రాజా వారిని ఒప్పించి వెంకయ్యను తమ కళాశాలలో అధ్యాపకునిగా నియమితులను చేశారు. 
 
దాదాపు ఎనిమిది సంవత్సరాలు నేషనల్ కాలేజ్లో వెంకయ్య గారు అధ్యాపకునిగా సేవచేశారు. తన స్వగ్రామం చల్లపల్లి మండలం యార్లగడ్డ నుంచి మచిలీపట్టణమునకు ప్రతి రోజు వెళ్లి విధులు నిర్వర్తించేవారు. విద్యార్థులకు వ్యవసాయశాస్త్రం, చరిత్రలతో పాటు, సైనిక విషయాలను కూడా వెంకయ్య బోధించేవారు. గుర్రపు స్వారీ, శరీర వ్యాయామం కూడా నేర్పేవారు.
 
మునగాల రాజా ప్రోత్సాహంతో వెంకయ్య మునగాల సంస్థానంలో వ్యవసాయక్షేత్రాన్ని స్థాపించి పరిశోధనలు చేశారు. అమెరికా నుంచి రకరకాల పత్తి విత్తనాలు రప్పించి ప్రయోగాలు చేశారు. 1909లో ఏలూరులో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో పరిశోధనా ఫలితాలను వెంకయ్య ప్రదర్శించగా ఆయన ప్రతిభకు స్వర్ణపతకం లభించింది. తద్వారా ఆయనకు పత్తి వెంకయ్యగా పేరువచ్చింది. 
 
చల్లపల్లి సమీపంలో వ్యవసాయక్షేత్రం స్థాపించి దానికి స్వేచ్ఛాపురం అని నామకరణం చేశారు. అక్కడ చేసిన పరిశోధనలు బ్రిటీష్ వారి దృష్టికి కూడా వెళ్లటంతో ఆయనకు రాయల్ అగ్రికల్చర్ సొసైటీ సభ్యత్వమిచ్చి గౌరవించారు. వజ్రాలపై కూడా పరిశోధనలు సాగించి వజ్రపు తల్లిరాయిని కనుగొన్న వెంకయ్యకు వజ్రాల వెంకయ్యగా పేరు వచ్చింది.

బందరు పోర్టు కోసం కృషి

1919లో బందరు ఓడరేవు శిథిలమై పోవటం చూసి దాన్ని పునరుద్ధరించాలని గుర్తించిన వెంకయ్య బందరు ఓడరేవుపై నైజాం నవాబుకు రాజకీయంగా హక్కు ఉందని రుజువు చేస్తూ ఆంగ్లంలో ఒక గ్రంథమును వ్రాసి ప్రచురించారు. ఈ విషయం బ్రిటీష్ వారి కన్నెర్రకు కారణమైంది.  అయితే వెంకయ్యకు నైజాం నవాబు బ్రహ్మరధం పట్టారు. బెజవాడ నుంచి స్పెషల్ కంపార్టుమెంట్లో నవాబుగారి అంతరంగిక సిబ్బంది “గార్డ్ ఆఫ్ ఆనర్” ఇచ్చి రాజబంధువుగా ఆహ్వానించి గౌరవించారు.

మహాత్ముని పిలుపునందుకుని భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములైన పింగళి వెంకయ్యకు బాలగంగాధర తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువులు. దేశ స్వాతంత్య్రం కోసం చర్చించేందుకు జరిగే అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు వెంకయ్య తరచూ హాజరవుతుండేవారు.

1906లో కలకత్తాలో కాంగ్రెస్ సమావేశాలను ప్రారంభించే ముందు జాతీయ నాయకులు బ్రిటీష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తుండటం చూసి వెంకయ్య ఆవేదనకు లోనయ్యారు.
మనదేశానికో జాతీయ జెండా ఆవశ్యకను గుర్తించిన వెంకయ్య నాటి నుంచి అదే ఆలోచనలతో కాలం గడుపుతూ పలు నమూనాలు రూపొందించటమే కాకుండా, 1916లో “భారతదేశానికి ఓ జాతీయ జెండా” అనే పుస్తకాన్ని కూడా రచించారు. పలుమార్లు తన ఉద్దేశ్యాన్ని జాతీయ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళారు.
 
అంతటితో ఆగకుండా 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో మహాత్మాగాంధీకి తన ఉద్దేశాన్ని వివరించారు. ఆయన ఆదేశం మేరకు కేవలం మూడు గంటల్లో మువ్వన్నెల జెండాను రూపొందించి బాపూజీకి అందించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో రూపొందించిన పతాకానికి మహాత్మాగాంధీ రాట్నం జోడించి, అదే సమావేశంలో వెంకయ్య రూపొందించిన జెండాను జాతీయ జెండాగా నిర్ణయిస్తూ ఏప్రిల్ 1వ తేదీన ఏకగ్రీవ తీర్మానం చేశారు. 
 
1921 ఏప్రిల్ 13వ తేదీ యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ “మన జాతీయ పతాకం” అనే శీర్షికలో ఇలా వ్రాసారు – “ఏకైక జాతీయ పతాకం కోసం మనం సర్వస్వం త్యాగం చేయాలన్న విషయం విస్మరించకుండా ఉండటం ఎంతో అవసరం. మచిలీపట్నం జాతీయ కళాశాల అధ్యాపకులు  పింగళి వెంకయ్య కొంతకాలంగా ఇతర దేశాల పతాకాలను వర్ణిస్తూ, భారత జాతీయ పతాకమునకు నమూనాలను పురమాయిస్తూ ఒక చిన్న పుస్తకాన్ని భారత ప్రజలకు అందచేశారు. బెజవాడలో వెంకయ్య గారిని “త్రివర్ణ పతాకము రాట్న చిహ్నమై ఉండాలని చెప్పగా వారు వెంటనే చిత్రించి ఇచ్చారు. వారి అకుంఠిత. ఉత్సాహము ఫలితముగా మూడు గంటల్లో నేనొక పతాకమును పొందగలిగాను” అని వ్రాశారు. 
 
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం భారత రాజ్యాంగ సభలో కూడా ఈ త్రివర్ణ పతాకమును జాతీయ పతాకంగా అంగీకరిస్తూ రాట్నమును మార్చి, ధర్మానికి, సత్యానికి ప్రతీక అయిన అశోక చక్రమును ఏర్పాటు చేయాలని తీర్మానము చేశారు.

భూగర్భ, ఖనిజాల సలహాదారునిగా సేవ

పింగళి వెంకయ్య తన రాజకీయ గురువు బాలగంగాధర తిలక్ మరణానంతరం రాజకీయాలకు దూరమై చాలాకాలం నెల్లూరులో ఉండి, అభ్రకంపై పరిశోధనలు చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఖనిజం ఎక్కడ లభిస్తుంది అనే అంశంపై పరిశోధనలు సాగించారు. భూగర్భ, ఖనిజాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా సేవలందించారు.

 
తనలోని జాతీయ భావాలు, మేథస్సుతో దేశానికి అపరిమితమైన సేవ చేసిన పింగళి వెంకయ్య దేశం నుంచి ఏమీ ఆశించలేదు. ప్రేమను పెంచు.. పదిమందికీ పంచు అనే మాటను పదేపదే చెబుతుంటే వెంకయ్య  తన జీవితపు చివరి రోజులను కృష్ణాజిల్లా విజయవాడలో పాల ఫ్యాక్టరీ సమీపంలో ఓ సాధారణ ఇంటిలో గడిపారు. 
 
ఉదయానే చవన్ ప్రాస్ తీసుకోవటం, ఆ తర్వాత చిక్కని కాఫీ, భోజనం చేసే కంటే ముందు సుగంధపాలు తాగేవారు. భోజనంలో తప్పనిసరిగా ఉసిరికాయ పచ్చడి, నెయ్యి ఉండాల్సిందే. వెంకయ్యకు ఆధ్యాత్మిక చింతన కూడా అధికం. ప్రతిరోజూ ఉదయం విష్ణు సహస్రనామం మూడుసార్లు, మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత భగవద్గీత చదివేవారు. 
 
ఆయన బయటకు వెళ్లేటప్పుడు. ఖద్దరు లాల్చీ, దానిపై నల్లటి కోటు వేసుకునేవారు. ఆయన స్నేహ మాధుర్యాన్ని చవిచూసిన వారిలో నాటి ప్రముఖులైన డాక్టర్ తెన్నేటి చలపతిరావు, నీలంరాజు వెంకట శేషయ్య, ఆయుర్వేద వైద్యులు గూడూరి నమశ్శివాయ, కె.ఎల్.రావు, సిరీస్ కంపెనీ అధినేత సిరీస్ రాజు ఉన్నారు. భారతదేశానికి ఎనలేని సేవ చేసిన పింగళి వెంకయ్య 1963 జులై 4న  స్వర్గస్తులయ్యారు. ఆయన సేవలకు సరైన గుర్తింపునివ్వటంలో భారత ప్రభుత్వం కొంత ఆలస్యం చేసిందనే ఆవేదన ఉంది.

ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య అని అధికారికంగా ప్రకటించి, గత సంవత్సరం జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించింది. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానం చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పింగళి వెంకయ్య కుమార్తెను ఘనంగా సత్కరించారు.

మొట్టమొదటిసారిగా లాల్ బహుదూర్ శాస్త్రి వెంకయ్యకు గుర్తింపు తీసుకొచ్చారు. భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో విజయవాడకు వచ్చిన లాల్ బహుదూర్ శాస్త్రి గాంధీ హిల్ లోని గ్రంథాలయం హాలులో పింగళి వెంకయ్య ఫొటోను ఏర్పాటు చేయించి గుర్తింపునిచ్చారు. 

తర్వాత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై వెంకయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. భారత పోస్టల్ శాఖ పింగళి వెంకయ్య ముఖచిత్రంలో కూడిన స్టాంపు విడుదల చేసి గౌరవించుకుంది.