అణ్వాయుధ ద‌ళ అగ్ర‌నేత‌ల్ని తొల‌గించిన చైనా

చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ అణ్వాయుధ ద‌ళానికి చెందిన ఇద్ద‌రు అత్యున్నత అధికారుల్ని ఆయ‌న తొల‌గించారు. వారి స్థానంలో ఇద్ద‌రు కొత్త వ్య‌క్తుల్ని ఆయ‌న నియ‌మించారు. పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ యూనిట్ అధిప‌తి జ‌న‌ర‌ల్ లీ యుచేవ్‌ను తొల‌గిస్తూ జీ జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. 
యుచేవ్‌తో పాటు ఆయ‌న డిప్యూటీపై కూడా వేటు వేశారు. న్యూక్లియ‌ర్ ఫోర్స్ కోసం మాజీ నేవీ చీఫ్ వాంగ్ హౌబిన్‌, పార్టీ సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుడు జూ జిషెంగ్‌ల‌ను నియ‌మిస్తూ అధ్య‌క్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు ఇచ్చారు. గ‌త ద‌శాబ్ధ కాలంలో ఇది చైనా మిలిట‌రీలో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పు అని విశ్లేష‌కులు చెబుతున్నారు. 

న్యూక్లియ‌ర్ స్ట్రాట‌జీలో చైనా త‌న విధానాన్ని మార్చుకున్న‌ద‌ని, అందుకే ఆ ద‌ళానికి చెందిన అత్యున్నత నేత‌ల్ని మార్చివేసిన‌ట్లు తెలుస్తోందని భావిస్తున్నారు. పీఎల్ఏను అసాధార‌ణ రీతిలో జిన్‌పింగ్ నియంత్రిస్తున్న‌ట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే, టాప్ ర్యాంకుల్లో ఉన్న నేత‌లు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని, దాని ప‌ట్ల జిన్‌పింగ్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ఆస్ట్రియా రాజ‌ధాని వియన్నాలో జ‌రిగిన ఎన్పీటీ స‌మావేశంలో చైనా పాల్గొన్న‌ది. అత్య‌ధిక సంఖ్య‌లో అణ్వాయుధాలు క‌లిగిన దేశాలు త‌మ బాధ్య‌త‌ల్ని గుర్తుంచుకోవాల‌ని, నిరాయుధీక‌ర‌ణ‌లో భాగంగా కొత్త ఒప్పందాన్ని అమ‌లు చేయాల‌ని చైనా పేర్కొన్న‌ది. ఆ స‌మావేశాల్లో చైనా విదేశాంగ శాఖ‌కు చెందిన ఆర్మ్స్ కంట్రోల్ శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ సున్ జియాబో మాట్లాడారు. అణు నిరాయుధీక‌ర‌ణ ప్ర‌క్రియ‌లో న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ దేశాలు చేరే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

పాక్ కు అండగా ఉంటాం

మరోవంక, అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా పాకిస్థాన్‌కు తాము అన్నివేళలా తోడుంటామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. తాము ప్రారంభించిన చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)యే ఇరుదేశాల ఉక్కుబంధానికి నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. సీపెక్‌ ప్రాజెక్టు ప్రారంభానికి పదేళ్లు పూర్తైన సందర్భంగా ఇస్లామాబాద్‌లో జరిగిన వేడుకలకు ఆయన తన వీడియో సందేశాన్ని పంపించారు.

‘‘రూ. 4.9 లక్షల కోట్ల విలువైన సీపెక్‌ మౌలికవసతుల కార్యక్రమం చాలా కీలకమైనది. 2013లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి మన ఇరు దేశాలు సంయుక్త కృషితో ఉమ్మడి ప్రయోజనాలతో ముందుకు వెళ్తున్నాయి. పాకిస్థాన్‌ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సైతం సీపెక్‌ ఒక కొత్త ఊపును తీసుకొచ్చింది. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా సరే..మున్ముందు మా మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపైనే దృష్టిపెడతాం. మా స్నేహాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం’’ అని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.