రష్యా వైపుకు మారుతున్న ఉక్రెయిన్ యుద్ధం

గత 17 నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా సేనలు భీకర యుద్ధం కొనసాగిస్తుండగా, ఇప్పుడు ఆ యుద్ధం రష్యా వైపు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా  రాజధాని మాస్కో నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ఆదివారం డ్రోన్లు విరుచుకుపడిన  నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రస్తుతం ఉక్రెయిన్ బలపడుతుందని ఇప్పుడు రష్యాకు యుద్ధం రాబోతోందని స్పష్టం చేశారు. ‘క్రమంగా యుద్ధం రష్యా భూభాగానికి తిరిగి వస్తోంది. ఆ దేశ ప్రతీకాత్మక కేంద్రాలు, సైనిక స్థావరాలకు వ్యాపిస్తోంది. ఇది అనివార్యమైన, సహజమైన, పూర్తి న్యాయమైన ప్రక్రియ’ అని ఉక్రెయిన్ నగరం ఇవానో ఫ్రాంకివ్స్కను సందర్శించిన సందర్భంగా జెలెన్ స్కీ పేర్కొన్నారు.

రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఉక్రెయిన్ ఇప్పుడు ప్రత్యర్థి దేశంపై ఎదురు దాడికి దిగుతోంది. మాస్కోపై రివర్స్ అటాకింగ్ మొదలు పెట్టింది. ఇంత కాలం తమ దేశ భూభాగంపై అడుగు పెట్టడానికి యత్నించిన రష్యా సేనలను తిప్పికొడుతోంది. తగినన్ని ఆయుధాలు సమకూరడంతో వాటిని మాస్కోపై ప్రయోగిస్తోంది. 

ఇందులో భాగంగా రాజధాని మాస్కోపై ఆదివారం డ్రోన్ల దాడి చేసింది. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో విమానాశ్రయానికి చెందిన రెండు భవనాలు దెబ్బతిన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ పలు డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. మొత్తం మూడు డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయని పేర్కొంది. దీనిని ఉగ్రదాడిగా మాస్కో అభివర్ణించింది. సరిహద్దుకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని మాస్కోపై డ్రోన్ దాడి జరగడం ఆ దేశ సైన్యాన్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది.