పాక్ బాంబు పేలుడులో 44 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తూన్‌క్వా ప్రాంతంలో ఆదివారం జరిగిన ఓ శక్తివంతమైన పేలుడు ఘటనలో 44 మంది మృతి చెందగా 200 మందికి పైగా  గాయపడ్డారు. సూసైడ్ బాంబర్ ఈ సమావేశ స్థలి వద్ద తనను తాను పేల్చుకున్నందునే ఈ దుర్ఘటన జరిగింది.  అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఈ కల్లోలిత ఖైబర్ ప్రాంతపు బజౌర్ గిరిజన జిల్లా రాజధాని ఖార్‌లో జమాయిత్ ఏ ఇస్లాం ఫజ్లు (జెయుఐఎఫ్) కార్యకర్తల సదస్సు జరుగుతుండగా పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.

ఈ పేలుడు తర్వాత సదస్సు ప్రాంతం అంతా రక్తసిక్తంగా మారింది. భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని చేరుకుని కట్టడి చేశాయి. సదస్సుకు దాదాపు 500 మంది కార్యకర్తలు హాజరైనట్లు వెల్లడైంది. ఈ సంస్థ ప్రభుత్వానికి సంకీర్ణ భాగస్వామ్య పక్షంగా ఉంది. దీనికి అత్యంత పలుకుబడిగల తీవ్రవాదపు మతనేత నాయకత్వం వహిస్తున్నారు. 

ఈ ప్రాంతంలో జరిగిన సదస్సుకు తాను కూడా హాజరు కావాల్సి ఉందని , అయితే వ్యక్తిగత కారణాలతో చివరి క్షణంలో పర్యటన రద్దు అయిందని జెయుఐ ఎఫ్ నేత హఫీజ్ హమీదుల్లా తెలిపారు.ఆయన కూడా ఈ ఘటనలో మృతి చెందినట్లు తొలుత కొన్ని టీవీఛానళ్లు, వార్తా సంస్థలు తెలిపాయి.

ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఇది జిహాద్ చర్య కాదని, కేవలం ఉగ్రవాద దుశ్చర్య అని తెలిపారు. మానవతపై, ఈ ప్రాంతంపై జరిగిన దాడి అని ప్రకటించారు. ఇంతకు ముందు కూడా తమ సంస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని, కొన్ని శక్తులు తమ కార్యకర్తలను టార్గెట్ చేసుకున్నారని, వీరిని ఎవరూ క్షమించరాదని తెలిపారు. 

తమ అణచివేత జరుగుతోందని, పార్లమెంట్‌లో తెలియచేశామని, అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మరో ఘోరం జరిగిందని విమర్శించారు. ఇస్లామాబాద్‌లో జెయుఐ ఎఫ్ వ్యవస్థాపక నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మన్ ఈ ఘటనపై స్పందిస్తూ  ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రాంతీయ తాత్కాలిక ముఖ్యమంత్రి ఆజాం ఖాన్ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని, బాధ్యులను తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు.