తెలంగాణ వరద ప్రాంతాలకు కేంద్ర బృందం

భారీ వరదల దాటికి తెలంగాణలోని చాలా జిల్లాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఓవైపు ప్రాణ నష్టంతో పాటు, ఎక్కువ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. చాలా గ్రామాలు ఇంకా తేరుకొని పరిస్థితి ఉంది. చాలాచోట్ల రోడ్లు తెగిపోయాయి. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన అధికారులు వరద నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. 
 
ఇదిలా ఉంటే వరద నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర బృందాలు కూడా తెలంగాణకు రానున్నాయి. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖల అధికారులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు. ఈ అధికారుల బృందంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ , జలశక్తి మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో పాటు స్పేస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉండనున్నారు. 
 
ఈ అధికారుల బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్డిఎంఎ) సలహాదారుడు కునాల్ సత్యార్థి నాయకత్వం వహించనున్నారు. కేంద్ర అధికారుల బృందం జులై 31వ తేదీన రాష్ట్రంలో పర్యటించనుంది.  భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై కేంద్ర అధికారుల బృందం సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతోపాటు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వివరాలను కూడా తీసుకోనుంది. వీటిని కూడా జతపరుస్తూ నివేదికను తయారుచేయనున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.
కాగా, భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 54.7 అడుగులకు చేరింది. ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే పలువురిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. భద్రాచలంలో ఐదు పునరావాస కేంద్రాలకు వరద బాధితులను తరలించారు. గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ ప్రధాన రహదారిపై నీరు చేరింది. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది.
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 మందికిపైగా మృతి చెందారు. గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉందని తెలుస్తోంది. ప్రధానంగా… ములుగు జిల్లా జంపన్నవాగు వరదలో గల్లంతైన 15మందిలో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది.