ఫిలిం ఛాంబర్ అధ్యక్షునిగా దిల్ రాజు ఎన్నిక

తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికల్లో  టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజు ప్యానల్ ఆధిక్యత సాధించింది.  తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పోలింగ్‌ లో దిల్‌ రాజు తన ప్రత్యర్థి, సీనియర్‌ నిర్మాత సి.కల్యాణ్‌ పై విజయం సాధించారు. 
 
దిల్‌ రాజు 31 ఓట్లతో గెలుపొందారు. టీఎఫ్‌ సీసీలో కీలక పోస్టులను దిల్‌ రాజు ప్యానెల్‌ కైవసం చేసుకుంది. ఫిల్మ్‌ చాంబర్‌ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా దామోదర ప్రసాద్‌ విజయం సాధించారు. టీఎఫ్‌ సీసీ కోశాధికారిగా ప్రసన్నకుమార్‌ ఎన్నికయ్యారు. మొత్తం ఓట్లు 48. మ్యాజిక్‌ ఫిగర్‌ 25 కాగా, దిల్‌ రాజు కు 31 ఓట్లు లభించాయి.
 
ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 12 మందిలో దిల్ రాజ్ ప్యానల్ నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. నిర్మాతల సెక్టార్‌లో మొత్తం 891 ఓట్లు పోల్‌ కాగా, 563 ఓట్లను దిల్‌ రాజు పొందారు.  స్డూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురులో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ నుంచే ఉన్నారు.  ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్ తరపున అటు ఆరుగురు ఇటు ఆరుగురు గెలుపొందారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ట్‌లో మాత్రం దిల్ రాజు, సీ కళ్యాణ్ ప్యానెల్స్ పోటాపోటీగా నిలబడ్డాయి. 
 
ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16)లో దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8 మంది సభ్యులు గెలిచారు. ప్రొడ్యూసర్ సెక్టర్ ఛైర్మన్ గా శివలంక కృష్ణ ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ గా మిక్కిలినేని సుధాకర్‌ని ఎన్నుకున్నారు.
 
వైవీఎస్ చౌదరి, అశోక్ కుమార్, స్రవంతి రవికిషోర్, యలమంచిలి రవిశంకర్, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాట్ల వంటి వారు దిల్ రాజు ప్యానెల్ నుంచి గెలిచారు. మొత్తంగా 1339 సభ్యులకు ఓటు హక్కు ఉండగా.. అందులో ప్రొడ్యూసర్ సెక్టార్స్ నుంచి 891 ఓట్లు, స్టూడియో సెక్టార్ నుంచి 68 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ నుంచి 380 ఓట్లు పోలయ్యాయి.