ఆగస్టు, సెప్టెంబర్‌లలో కూడా భారీ వర్షాలు

తెలంగాణాలోవర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం కాస్తా శుక్రవారం ఉదయం నాటికి బలహీనపడిందని పేర్కొంది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని వెల్లడించింది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీచేసింది. కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి -కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది.

రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం అధికంగా ఉందని, మరో అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణలో మూడు రోజుల పాటు విస్తారంగా కురిశాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. 

వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యాయి. మిగ‌తా ప్రాంతాల్లో కూడా భారీ వానలు పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

జూలై 29, 30, 31 తేదీల్లో ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని ప్రకటించింది. తెలంగాణలో 10 రోజుల ముందు వరకు 54 శాతం లోటు వర్షపాతం కనిపించింది. శుక్రవారం నాటికి 65 శాతం అధిక వర్షపాతం నమోదు అయింది.  గడిచిన 24 గంటల్లో 24 చోట్ల 60 శాతానికి పైగా, రెండు చోట్ల 20 నుంచి 59 శాతం, ఒక చోట సాధారణ, 6 చోట్ల లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.

భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, ఈ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో మొత్తం 17 మంది మృతిచెందారు. మరో 9 మంది గల్లంతు అయ్యారు. కనిపించకుండా పోయిన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.