బిఆర్ఎస్ ఎంపీకి `సుప్రీం’లో ఎదురుదెబ్బ

బీఆర్ఎస్‌లో ప్రజాప్రతినిధులను అనర్హత పిటీషన్లు వెంటాడుతున్నాయి.  ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునివ్వగా,  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు బెంచ్ కొట్టేసింది. మంత్రిపై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

ఇప్పుడు మరో ప్రజాప్రతినిధిపై అనర్హత విషయంలో సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అనర్హత పిటిషన్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బీబీ పాటిల్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీగా బీబీ పాటిల్ విజయం సాధించారు.

అయితే  ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున బీబీ పాటిల్ ఎంపిక చెల్లదంటూ కె. మదనమోహన్ రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అక్రమాల కేసులను త్వరితగతిన విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని, జాప్యం కారణంగా తీర్పు వచ్చే సరికి పదవీకాలం పూర్తయిపోతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు రోజువారీ విచారణకు  హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బీబీ పాటిల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

అయితే బీబీ పాటిల్ వేసిన పిటిషన్‌పై మంగళవారం రోజు సర్వోన్నత న్యాయస్థానం విచారించగా బీబీ పాటిల్ వాదనల్లో మెరిట్స్ లేనందున పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని ధర్మాసనం ఎంపీకి సూచించింది. దీంతో బీబీ పాటిల్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టైంది.