ఎంపీ సంజ‌య్ సింగ్‌పై రాజ్య‌స‌భ స‌స్పెన్ష‌న్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్‌పై రాజ్య‌స‌భ వేటు వేసింది. వ‌ర్షాకాల స‌మావేశాలు పూర్తి అయ్యేవ‌ర‌కు ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ విధించింది. సోమవారం స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత ఎంపీ సంజ‌య్ సింగ్  వెల్‌లోకి దూసుకువెళ్లి ర‌భ‌స సృష్టించారు.  మ‌ణిపూర్ అంశంపై చ‌ర్చించాల‌ని ప‌ట్టుప‌ట్టారు. 
 
చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఆదేశించినా ఎంపీ సంజ‌య్ వెన‌క్కి వెళ్ల‌లేదు. దీంతో చైర్మెన్ ఆగ్ర‌హానికి గుర‌య్యారు. సభలో ‘అనుచిత ప్రవర్తన’ కారణంగా ఆయనను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని సభానేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టరు. దీనిని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. పీయూష్ గోయెల్ తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు సంజయ్ సింగ్ అనుచిత ప్రవర్తనపై ధన్‌కఢ్ ఆయనను హెచ్చరించారు.
 
రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ సమాధానం ఇచ్చారు. అయితే ఆ స‌మ‌యంలో ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీంతో చైర్మెన్ జ‌గ‌దీన్ సీరియ‌స్ అయ్యారు. అయినా ఆప్ ఎంపీ వినిపించుకోలేదు. దీంతో ఆయ‌న్ను ఈ సెష‌న్‌కు స‌స్పెండ్ చేశారు.