వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు చేసిన కేసీఆర్

నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు.
 
రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని, వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి పాసైనవారు, పది పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారని తెలిపారు. 
 
వీరి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారిని భర్తీ చేస్తాం అని సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 
 
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. వీఆర్ఏల విద్యార్హత‌ల‌ను బ‌ట్టి నాలుగు శాఖ‌ల్లో వీఆర్ఏల‌ను సర్దుబాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నీటిపారుద‌ల‌, పుర‌పాల‌క శాఖ‌, పంచాయ‌తీరాజ్ శాఖ్, మిష‌న్ భ‌గీర‌థ శాఖ‌లో వీఆర్ఏల‌ను స‌ర్దుబాటు చేయ‌నున్నారు. 
 
కాగా, 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వార‌సుల‌కు ఇచ్చేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అదేవిధంగా  2 జూన్ 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్ఎ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం స్ప‌ష్టం చేశారు.