21 రోజుల్లో 3 లక్షలకు పైగా అమర్‌నాథుని దర్శనాలు

దక్షిణ కశ్మీర్‌లో జులై ఒకటవ తేదీన అమర్‌నాథ్‌ యాత్ర మొదలైన తొలి 21 రోజుల్లో 3,07,354 భక్తులు అమర్‌నాథ్‌ గుహ క్షేత్రాన్ని దర్శించుకున్నారని జమ్మూ కాశ్మీర్‌ సమాచార, పౌర సంబంధాల విభాగం తెలిపింది. మౌలిక సదుపాయల అభివృద్ధి, సంబంధిత ప్రభుత్వ సేవల కారణంగా గత ఏడాది కన్నా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ సంఖ్యలో పవిత్ర గుహను దర్శించుకున్నారని పేర్కొంది.
యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి దాదాపు 30 ప్రభుత్వ విభాగాలు సేవలు అందిస్తున్నాయి. అంతేకాకుండా 100 పడకలతో కూడిన రెండు ఆసుపత్రుల నిర్మాణం అనారోగ్యం పాలైన యాత్రికులకు సత్వర చికిత్స అందించడానికి ఉపకరించింది. ప్రతి యాత్రికుల శిబిరం వద్ద నియుక్తులైన వైద్య, ఆరోగ్య నిపుణుల బృందం ప్రతి రోజూ వందలాది యాత్రికులకు వైద్య సేవలు అందించడంతో పాటుగా వారికి అవసరమైన మందులను సమకూర్చారని పేర్కొంది.

కాగా, జమ్ములోని భగవతి నగర్ శిబిరం నుంచి శనివారం తెల్లవారు జామున అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరిన 3472 మంది యాత్రికుల కాన్వాయ్ మార్గమధ్యలో రాంబాన్ వద్ద కొంతసేపు ఆగిపోయింది. భారీ వర్షాలకు జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడడంతో కొద్దిసేపు ఆపవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. 

270 కిమీ పొడవున్న ఈ జాతీయ రహదారిలో మెహర్, డాల్వాస్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వాటి శిధిలాలను తొలగించిన తరువాత ట్రాఫిక్‌ను మళ్లీ పునరుద్ధరించారు. 20 వ బ్యాచ్‌లో 3472 మంది యాత్రికులు జమ్ము లోని భగవతి నగర్ స్థావరం నుంచి అమర్‌నాథ్ యాత్రకు శనివారం తెల్లవారు జామున మొత్తం 132 వాహనాల్లో బయలు దేరారు. 

మధ్యాహ్నానికి వారు బనిహాల్ చేరుకున్నారు. కొద్ది సేపు పోయిన తర్వాత వీరు బయలుదేరడానికి అనుమతించారు. వీరిలో 2515 మంది పహల్‌గామ్ నుంచి, మరో 957 మంది గండెర్‌బల్ జిల్లా బల్తాల్ రూటు నుంచి అమర్‌నాధ్ గుహకు వెళ్లేలా ఏర్పాట్లు జరిగాయి.