అక్రమంగా చొరబడుతూ పట్టుబడిన ఇద్దరు చైనీయులు

భారత దేశంలోకి అక్రమంగా, చట్టవిరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనీయులు ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డారు. వీసా, చెల్లుబాటయ్యే పత్రాలు లేకుండా బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా గుండా భారత దేశంలోకి ప్రవేశించేందుకు వీరు ప్రయత్నించారు. వీరు ఈ విధంగా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రస్తుతం వెల్లడికాలేదు.
అయితే వీరు గూఢచర్యం కోసం వస్తున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ భారత్‌లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించడానికి గతంలో కూడా ప్రయత్నించారు.  అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఝావో జింగ్, ఎఫ్‌యూ కోంగ్ అనే ఇద్దరు చైనా పురుషులు ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డారు.
వీరు బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా గుండా భారత దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. రాక్సౌల్ వద్ద వీరిని శనివారం సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్ చేశారు. తూర్పు చంపారన్ పోలీసు సూపరింటెండెంట్ కాంతేష్ కుమార్ మిశ్రా ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ఝావో జింగ్, ఎఫ్‌యూ కోంగ్ ఎటువంటి చెల్లబాటయ్యే పత్రాలు లేకుండా భారత దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని శనివారం ఉదయం 8.45 గంటలకు రాక్సౌల్ పట్టణంలో అరెస్ట్ చేశారు.

వీరు తూర్పు చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్ నివాసులు. వీరు చట్టవిరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించడానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది. వీరు గూఢచర్యం కోసం వచ్చి ఉంటారనే వాదనను తోసిపుచ్చలేమని ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పని చేస్తున్న ఇమిగ్రేషన్ అధికారులు చెప్పారు. 

వీరిని ప్రశ్నించినపుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతోపాటు విచిత్రంగా ప్రవర్తించారని తెలిపారు. వీరిని ఈ నెల 2న కూడా అడ్డుకున్నట్లు తెలిపారు. ఆ రోజున హెచ్చరించి వదిలిపెట్టినట్లు తెలిపారు. వీసాలు తీసుకుని రావాలని చెప్పినట్లు తెలిపారు.