మాతృభాషలో విద్యాబోధనకు సీబీఎస్‌ఈ అనుమతి

మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది. 
 
ఇందుకు అనుగుణంగా కొత్త పాఠ్యపుస్తకాలను 22 షెడ్యూల్డ్‌ భాషల్లో ముద్రించాలని ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్’ని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. నూతన విద్యా విధానానికి ఈ నెలతో మూడేండ్లు పూర్తవుతున్నాయి. 
 
దీన్ని పురస్కరించుకుని త్వరలోనే కొత్త కరిక్యులమ్‌ను ప్రకటించే అవకాశం ఉన్నది.  సీబీఎస్‌ఈ పాఠశాలల్లో భిన్న భాషల్లో విద్యాభోధన అమలుచేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను అన్వేషించాలని, నిపుణులతో సంప్రదింపులు జరుపాలని, ఇతర పాఠశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ జోసెఫ్‌ ఇమ్మానుయేల్‌ పాఠశాలలకు సూచించారు.
 
 ప్రస్తుతం సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో హిందీలో బోధిస్తున్నారు. సీబీఎస్‌ఈ తాజా నిర్ణయంతో పాఠశాలలు ఇకపై తమకు నచ్చిన భారతీయ భాషల్లో విద్యాబోధన చేసేందుకు వీలవుతుంది.