రాజ్యాంగ ధర్మాసనానికి ఢిల్లీ ఆర్డినెన్స్‌ కేసు

ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపనున్నది. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దేశ రాజధాని ఢిల్లీలో సర్వీస్ అధికారులను బదిలీ, నియమించే హక్కు కేంద్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అప్పగించింది. ఇందు కోసం కేంద్రం నేషనల్‌ క్యాపిటర్‌ సివిల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అధ్యక్షతన చీఫ్‌ సెక్రెటరీ, ప్రిన్సిపల్‌ హోం సెక్రెటరీని సభ్యులుగా నియమించింది. 

అధికారుల బదిలీ, నియామకంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడితే తుది నిర్ణయం తీసుకునే హక్కును లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెట్టింది. కేంద్రం తీసుకువచ్చిన నేషనల్‌ క్యాపిటర్‌ సివిల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆర్డినెన్స్‌ను ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ మండిపడుతున్నది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీలో పరిపాలన అధికారుల బదిలీ, నియమించే హక్కు ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేస్తూ మే 11న ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. 19న కేంద్రం మరోసారి ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్‌కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌ సర్కారు మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ క్యాపిటర్‌ సివిల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆర్డినెన్స్‌ను చట్టంగా చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోనే ఆర్డినెన్స్‌ను చట్టంగా చేయాలని భావిస్తున్నది. 

మరో వైపు ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఢిల్లీ ప్రభుత్వం బిజీగా ఉంది. కాంగ్రెస్, టీఎంసీ సహా అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతును ప్రకటించాయి.