3 కోట్లకు పైగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు

2023 -24 అసెస్మెంట్ సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడానికి ఆఖరు తేదీ దగ్గర పడుతోంది. ఈ నెల 31 లోగా ఐటీఆర్ లను ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే, జులై 18 నాటికే 3.06 కోట్ల ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలయ్యాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. 

వాటిలో 91% రిటర్న్స్ ఈ – వెరిఫికేషన్, 1.5 కోట్ల ఐటీఆర్ ల ప్రాసెసింగ్ కూడా పూర్తయిందని వెల్లడించింది. గత సంవత్సరం 3 కోట్ల ఐటీఆర్ లు జులై 26 నాటికి దాఖలైన విషయాన్ని గుర్తు చేసింది.  గత సంవత్సరంతో పోలిస్తే వారం రోజుల ముందే 3 కోట్ల ఐటీఆర్ ల మైలు రాయిని దాటడంలో సహకరించిన పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆదాయ పన్ను శాఖ ట్వీట్ చేసింది. 

జులై 18 నాటికి దాఖలైన 3.05 కోట్ల ఐటీఆర్ లలో 2.81 కోట్ల ఐటీఆర్ ల ఈ వెరిఫికేషన్ పూర్తయిందని, అలాగే, 1.5 కోట్ల ఐటీఆర్ ల ప్రాసెసింగ్ కూడా ముగిసిందని వివరించింది. చివరి నిమిషంలో హడావుడిగా ఐటీఆర్ లను దాఖలు చేయడం కన్నా, ముందే ప్రశాంతంగా ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడం ఉత్తమమని సూచించింది.

ఈ సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడానికి విధించిన ఆఖరు గడువును పొడగించే ఆలోచన లేదని ఆదాయ పన్ను శాఖ వివరించింది. జులై 31 లోపు అర్హులైన అందరూ ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాలని సూచించింది. ఐటీఆర్ ల ఫైలింగ్ కు చివరి తేదీని పొడిగిస్తారన్న ఆలోచనతో ఐటీఆర్ లను ఫైల్ చేయకుండా ఉండవద్దని హితవు పలికింది. ఈ సంవత్సరం ఐటీఆర్ ల సంఖ్య మరింత పెరుగుతందని భావిస్తున్నామని కేంద్ర రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా తెలిపారు.