రైళ్లలో జనరల్ కోచ్ ప్రయాణికుల కోసం రూ. 20 కే భోజనం

రైళ్లలో జనరల్ కోచ్ ల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికుల కోసం చవగ్గా భోజన సదుపాయం కల్పించాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. రూ. 20 లకు భోజనం, రూ. 50 లకు స్నాక్స్ అందించాలని, తక్కువ ధరకు తాగునీరు కూడా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ రైల్వే విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
రైళ్లలో జనరల్ కోచ్ ల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులకు అందుబాటు ధరలో నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని రైల్వే విభాగం నిర్ణయించింది. ప్లాట్ ఫామ్ లపై ఈ బోగీలు ఆగే ప్రదేశంలో చవకగా ఆహారం, స్నాక్స్, తాగు నీరు అందించే సర్వీస్ కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. 
 
ఈ సర్వీస్ కౌంటర్లలో ఎకానమీ భోజనం రూ. 20 లకు, స్నాక్స్ రూ. 50 లకు లభిస్తాయి. తక్కువ ధరకే స్వచ్ఛమైన తాగు నీరు కూడా లభిస్తుంది. ఐఆర్సీటీసీ  కిచెన్ యూనిట్ల నుంచే ఈ ఆహార పదార్ధాలు సరఫరా అవుతాయి. మొదట ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు ప్లాట్ ఫామ్స్ పై ఈ సర్వీస్ కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. 
 
ఇప్పటికే దేశవ్యాప్తంగా 51 రైల్వే స్టేషన్లలో ఈ ఎకానమీ సర్వీస్ కౌంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరో 13 స్టేషన్లలో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎకానమీ సర్వీస్ కౌంటర్ల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని రైల్వే శాఖ వెల్లడించింది.  ఈ సర్వీస్ కౌంటర్ల ద్వారా లభించే నాణ్యమైన, రుచికరమైన ఆహారం జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి, ముఖ్యంగా జనరల్ బోగీలో దూర ప్రయాణాలు చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.