బిఆర్ఎస్ కు 11 ఎకరాల కేటాయింపుపై హైకోర్టు షాక్

కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాల భూమి కేటాయించిన తెలంగాణ ప్రభుత్వంకు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోకాపేటలో బీఆర్ఎస్ కు భూమి కేటాయింపుపై అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు విచారణ సందర్బంగా ఆదేశించింది. 

దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకు కేటాయించారని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే దీనికి సంబంధించి పత్రాలను గోప్యంగా ఉంచారని వాదనలు వినిపించారు.

 అసలు బీఆర్‌ఎస్‌ పార్టీకి 11 ఎకరాల భూకేటాయింపు అంశంపై క్యాబినెట్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయం తర్వాత జీవో జారీచేస్తామని పేర్కొంది. ఈ వాదనను పిటిషనర్‌ వ్యతిరేకిస్తూ నిర్ణయం జరగకపోతే సీఎం స్వయంగా భూమిపూజ ఎలా చేశారని ప్రశ్నించారు.

ఈ క్రమంలో కోర్టు ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 16కి హైకోర్టు వాయిదా వేసింది. కోర్టు నోటీసులతో సీఎంగా, బీఆర్ఎస్ అధినేతగా సీఎం కేసీఆర్ కు షాక్ తగిలినట్లైంది. కోకాపేటలో భూములకు భారీ ధరాలున్నాయని.., ఎకరం ఏకంగా రూ.50 కోట్లు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.3.41 కోట్లకు కేటాయించినట్టు పిటీషన్ లో పేర్కొన్నారు. 

ఇక మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఈ కేటాయింపులు జరిగినట్టు ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే ప్రభుత్వం చెబుతుంది కేవలం కవర్ స్టోరీ అని, బీఆర్ఎస్ కు పార్టీ కార్యలయాన్ని ఏర్పాటు చేయడం కోసమే ఈ కేటయింపు వెనక ఉద్దేశమని పిటిషనర్ ఆరోపించారు. ప్రజల సొమ్ముతో హైదరాబాద్ లో మరో కార్యాలయం అవసరం లేదని పిటీషన్ లో పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇరువురి వాదనలను హైకోర్టు విననుంది. పిటీషనర్ తరపు న్యాయవాది ఇప్పటికే వాదనలు వినిపించగా, దానికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందనేది చూడాలి.  ఇక, ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్  నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన భూమిలో ప్రభుత్వం సర్వే చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటివరకు ఎలాంటి సర్వే చేయొద్దని కోర్టు స్టే ఇచ్చింది.