కిలో రూ 80 లకే అందుబాటులోకి టమేటాలు

సరైన సమయంలో పంట చేతికి రాకపోవడంతో టమాటా ధరలు నెల రోజులుగా పెరుగుతూ ఉండటంతో అందుబాటులో లేక ప్రజలు బెంబేలెత్తుతున్న సమయంలో వారికి ఊరట కలిగించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో భారీ ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా చేతికి అందాల్సిన పంట నాశమైంది. అందుకే రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ. 160ని దాటితే, మరికొన్ని ప్రాంతాల్లో రూ. 250 కూడా తాకింది. 

ప్రభుత్వ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా కేజీ టమాటా ధర సగటున రూ. 117గా ఉంది. దానితో సబ్సిడీలో ఇచ్చే టమాటాల ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా హోల్​సేల్​ మార్కెట్​లో టమాటాల సబ్సిడీ రేటును కేజీకి రూ. 90 నుంచి రూ. 80కి తగ్గించింది. దిల్లీ, ఎన్​సీఆర్​తో పాటు ఎంపిక చేసిన పలు రాష్ట్రాల్లోని నగరాల్లో ఈ రేట్లు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి.  వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.

“కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హోల్​సేల్​ టమాటాల ధరలను తగ్గించింది. ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాస్త ఉపశమనం లభించనుంది,” అని ఓ అధికారి వెల్లడించారు. ఢిల్లీతో పాటు నోయిడా, కాన్పూర్​, వారణాసి, పట్నా, ముజాఫర్​పూర్​లోని ఎన్​ఏఎఫ్​ఈడీ (నేషనల్​ లెవల్​ ఫార్మర్స్​ కో- ఆపరేటివ్​ మార్కెటింగ్​ ఆర్గనైజేషన్​), ఎన్​సీసీఎఫ్​ (నేషనల్​ కో-ఆపరేటివ్​ కన్జ్యూమర్​ ఫెడరేషన్​)ల ద్వారా సబ్సిడీ రేట్లకు టమాటాలను విక్రయిస్తోంది కేంద్రం.

“దేశంలోని 500కుపైగా సప్లై పాయింట్లలో పరిస్థితులను పరిశీలించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి సబ్సిడీలో ఇచ్చే కేజీ టమాటా ధర రూ. 80గా ఉండనుంది. దిల్లీ, బిహార్​, ఉత్తర్​ ప్రదేశ్​లలో తమ నిర్ణయం ఆదివారం అమల్లోకి వచ్చింది. మార్కెట్​లో ధర పరిస్థితి ఆధారంగా ఇతర నగరాల్లో సోమవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది,” అని కేంద్రం ఓ ప్రకటన విడదుల చేసింది.

ప్రజలకు ఉపశమనాన్ని కల్పించేందుకు  మొబైల్​ వ్యాన్​ల ద్వారా కేంద్రం శనివారం వరకు కేజీ టమాటాలను రూ. 90కి విక్రయించింది. ఆ ధరను రూ. 80కి తగ్గించింది. టమాటాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి వాటిని కొని, సరసమైన ధరలకు కన్స్యూమింగ్ సెంటర్లకు సరఫరా చేయాలని ఎన్‌సీసీపీ, ఎన్ఏఎఫ్ఈడీలను ప్రభుత్వం ఈ నెల 12న ఆదేశించింది.