ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా విదేశీ పెట్టుబడులు 

దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ నెల తొలి 15 రోజుల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రూ.30,600 కోట్ల పై చిలుకు ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చి చేరాయి. 
బలమైన ఆర్థిక వృద్ధితోపాటు కార్పొరేట్ సంస్థల తొలి త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటం ఎఫ్‌పీఐ పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉన్నాయి.  ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే మే, జూన్ నెలల్లో వచ్చిన ఎఫ్‌పీఐ పెట్టుబడులను జూలై దాటేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 మే నెలలో రూ.43,838 కోట్లు, జూన్ నెలలో రూ.47,148 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చి చేరాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రూ.1.07 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చాయి. మున్ముందు దేశంలోకి విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు మరింత మెరుగ్గా విస్తృత ప్రాతిపదికన వస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికీ భారత్‌లో పెట్టుబడులు, వాటి విలువతో పోలిస్తే చైనా పెద్ద ఎత్తున ఆకర్షణీయంగా కనిపిస్తున్నదని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటర్జీ ఆఫీసర్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. కనుక ఎఫ్‌పీఐల ‘సెల్ చైనా, బై భారత్’ పాలసీ ఎంతోకాలం కొనసాగదని స్పష్టం చేశారు.