ఎన్డీయేలో తిరిగి చేరిన ఓం ప్రకాష్ రాజ్‌భర్

కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పాత మిత్రులు మళ్లీ ఏకం అవుతున్నారు. ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)లో ఆదివారంనాడు తిరిగి చేరారు. ఉత్తరప్రదేశ్‌లో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయడంలో బీజేపీ, ఎస్‌బీఎస్‌పీ బలమైన శక్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా రాజ్‌భర్ తెలిపారు. 
 
ఈనెల 18న జరిగే ఎన్డీయే సమావేశంలో తాను కూడా పాల్గొంటున్నట్టు ఆయన చెప్పారు. ”ఎస్‌బీఎస్‌పీ, బీజేపీ కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేయాలని నిర్ణయించాయి. కేంద్ర మంత్రి అమిత్‌షా జూలై 14న మేము కలుసుకున్నాం. పేద ప్రజలు, బడుగు వర్గాల సంక్షేమంతో సహా పలు అంశాలపై మేము చర్చించాం” అని వెల్లడించారు. 
 
తమ అభిప్రాయాలతో అమిత్‌షా ఏకీభవించారని చెబుతూ పేదలు, బడుగు వర్గాల స్థితిగతులు మెరుగపరచాలనే ప్రధాన మంత్రి మోదీ విజన్‌ను సమష్టిగా ముందుకు తీసుకువెళ్తాం అని రాజ్‌భర్ చెప్పారు. విపక్షాల కూటమికి మద్దతిస్తామంటూ గతంలో చేసిన ప్రకటనపై అడిగినప్పుడు, విపక్షాల నుంచి ఒక్కమాట కూడా రానప్పుడు ఎంతకాలం నిరీక్షించగలం? అని ప్రశ్నించారు. 
 
తాను ఎన్నో సార్లు మాట్లాడినప్పటికీ విపక్షాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన గుర్తు చేశారు. ఈనెల 18న జరిగే ఎన్డీయే సమావేశానికి తాము హాజరవుతున్నామని చెబుతూ మంత్రి పదవి అనేది తనకు ముఖ్యం కాదని, యూపీలో ఎలాంటి పోటీ లేదని రాజ్‌భర్ స్పష్టం చేశారు. కాగా, రాజ్‌భర్‌ను ఎన్డీయేలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు అమిత్‌షా ఓ ట్వీట్‌లో తెలిపారు. 
 
మోదీ సారథ్యంలోని ఎన్డీయేలోకి చేరాలని రాజ్‌భర్ నిర్ణయించుకున్నారని, ఎన్డీయే కుటుంబంలోకి ఆయనను ఆహ్వానిస్తున్నామని అమిత్ షా తెలిపారు. రాజ్‌భర్ రాకతో యూపీలో ఎన్డీయే మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంలో 2017-2019 మధ్య రాజ్‌భర్ మంత్రిగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా ఆయనను బీజేపీ తొలగించింది. ఆ తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని రాజ్‌భర్ పోటీ చేశారు. 

అయితే గత ఏడాది జూలైలో ఆ పార్టీతో పొత్తు కూడా ముగిసింది. ఎస్‌పీలో చేరడానికి ముందు అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎంతో రాజ్‌భర్ చేతులు కలిపారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుంటే, పూర్వాంచల్ ప్రాంతంలో ఎస్‌బీఎస్‌పీకి గట్టి పట్టు ఉన్నందున ఆ పార్టీతో పొత్తు బీజేపీకి కలిసొచ్చే అశంగా చెప్పవచ్చు.