రాజస్థాన్ లో ప్రతిరోజూ 5 నుంచి 7 వరకూ హత్యలు

రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని చెబుతూ రాష్ట్రంలో ప్రతిరోజూ 5 నుంచి 7 వరకూ హత్యలు చోటుచేసుకుంటున్నాయంటూ అశోక్‌గెహ్లాట్ ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తూర్పురాపట్టారు. గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఇంకెంత మాత్రం ప్రజలు సహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 
జైపూర్‌లో బీజేపీ చేపట్టిన ‘నహీ సహేగా రాజస్థాన్’ ప్రచార కార్యక్రమాన్ని జేపీ నడ్డా ఆదివారంనాడు ప్రారంభిస్తూ గెహ్లాట్ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఉదయ్‌పూర్‌లో కన్హ్యయ లాల్ హత్య, మతకల్లోలాలు, ఇతర అంశాలపై కూడిన ఒక వీడియోను ఆయన విడుదల చేశారు.
 
”మేము (బీజేపీ) సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి పనులను కోసం పనిచేస్తున్నాం. అయితే మేము చేపట్టిన అభివృద్ధి పనులకు గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత, దౌర్యన్యాలు, ఆశ్రితపక్షపాతం, అవినీతి అవరోధంగా ఉన్నాయి” అంటూ నడ్డా ధ్వజమెత్తారు. 
 
రాజస్థాన్‌లో రికార్డు స్థాయిలో 24 వేల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని చెబుతూ ఇక్కడికి సమీపంలోనే అత్యాచార బాధితురాలైన ఓ మహిళ ఆత్మహత్మకు పాల్పడిన కేసు కూడా ఒకటి వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. సంస్కృతి, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన రాజస్థాన్‌లో ఈరోజు మహిళల అణచివేత పరాకాష్టకు చేరుకుందని విమర్శించారు. 
 
అలాంటి వ్యక్తులు సరైన సమాధానం చెప్పే బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని స్పష్టం చేస్తూ గెహ్లాట్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంకెంత మాత్రం సహించే పరిస్థితిలో లేరని నడ్డా తేల్చి చెప్పారు.