దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో మరో చీతా మృతి

దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో మరో చీతా మృతి చెందింది. చీతా మెడపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. చీతా బరువు కూడా భారీగా తగ్గిందని చెప్పారు. ఫిబ్రవరిలో దాదాపు 55 కేజీలు ఉన్న ఆ చీతా ఇప్పుడు 43 కేజీలకు తగ్గిందని తెలిపారు. మధ్య ప్రదేశ్‌లోని కునూ నేషనల్ పార్క్‌లో నాలుగు నెలల్లోనే ఎనిమిది చిరుత పులులు ప్రాణాలు కోల్పోయాయి. 

పుట్టిన చిరుతల్లో 90 శాతం వరకు తక్కువ వయసులోనే మరణిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ, అభయారణ్యంలో పరిరక్షణలో ఉన్న చిరుత పులులు వరుసగా మరణిస్తుండటం అత్యంత విషాదకరం. కునూ నేషనల్ పార్క్‌లో శుక్రవారం ఉదయం ఆఫ్రికన్ చీతా సూరజ్ (మగ) నిర్జీవంగా కనిపించింది. ఈ పార్క్‌లో ఉంటున్న తేజస్ అనే మగ చిరుత పులి మంగళవారం మరణించింది.

ఓ ఆడ చిరుతతో జరిగిన ఘర్షణలో దీనికి తీవ్రమైన షాక్ తగిలిందని, దాని నుంచి అది కోలుకోలేకపోయిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. మార్చి 27న ఆడ చిరుత పులి సాషా మూత్రపిండాల వ్యాధితో మరణించింది.  ఏప్రిల్ 23న ఉదయ్ అనే చిరుత పులి కార్డియో-పల్మనరీ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయింది. మే 9న దక్ష అనే ఆడ చిరుత పులి ఓ మగ చిరుత పులితో సంతానోత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నపుడు మరణించింది.

మే 25న రెండు చిరుత పులి పిల్లలు వడగాడ్పుల వాతావరణాన్ని తట్టుకోలేక, డీహైడ్రేషన్‌తో మరణించాయి.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిరుత పులుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తాజాగా సూరజ్ అనే చిరుత పులి మరణించడంతో ప్రభుత్వానికి శరాఘాతం తగిలినట్లయింది. 

ఆరు చిరుత పులులు మరణించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, వీటి పెంపకంలో ఎటువంటి లోపాలు జరగలేదని స్పష్టం చేశారు. చీతాల్లో 90 శాతం వరకు బాల్యంలోనే మరణిస్తాయని వన్యప్రాణులపై జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. 

సౌత్ ఆఫ్రికన్ వైల్డ్‌లైఫ్ నిపుణుడు విన్సెంట్ వాన్ డెర్ మెర్వె మే నెలలో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన చీతాల రీఇంట్రడక్షన్ ప్రాజెక్టులో మరిన్ని చీతాలు మరణించే అవకాశం ఉందని చెప్పారు. చీతాలు తమ సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించినపుడు పులులు, చిరుత పులులతో జరిగే ఘర్షణల్లో అవి ప్రాణాలు పోగొట్టుకుంటాయని తెలిపారు.