యుక్రెయిన్ సభ్యత్వంపై నాటో సదస్సులో తర్జన భర్జనలు

రష్యా ఉక్రెయిన్ పై యుద్దానికి దిగడంకు దారితీయడానికి ప్రధాన కారణమైన నాటోలో ఆ దేశానికి సభ్యత్వం ఇవ్వడం గురించి లిథుయేనియా రాజధానిలో మంగళవారం ప్రారంభమైన నాటో సదస్సులో  పాశ్చాత్త దేశాలు తర్జన భర్జనలు పడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ప్రధానంగా చర్చ సాగింది.  రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ మిలటరీ చర్యలకు ఆజ్యం పోయడంపైనే పశ్చిమ దేశాలు దృష్టి సారించాయి.

నాటోలో ఉక్రెయిన్‌ సభ్యత్వానికి నిర్దిష్టమైన గడువును విధించడంలో నాటో నేతలు విఫలమయ్యారు. కానీ ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక మద్దతును కొనసాగించడంపై చర్చలు జరుగుతున్నాయి.  అలాగే నాటోతో ఉక్రెయిన్‌ సంబంధాలు, యుద్ధం ముగిసిన తర్వాత ఇచ్చే భద్రతాపరమైన హామీలు తదితరాలపై కూడా నేతలు చర్చిస్తున్నారు.

నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌  ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, నాటోకు ఉక్రెయిన్‌ను మరింత దగ్గరగా తీసుకురావడానికి మూడు అంశాల ప్యాకేజీపై మిత్రపక్షాలు అంగీకారానికి వచ్చాయని చెప్పారు.  అయితే, “మిత్రపక్షాలు అంగీకరించి, షరతులన్నీ నెరవేరిననపుడు” నాటోలో చేరాల్సిందిగా ఉక్రెయిన్‌కు ఆహ్వానం అందచేస్తామని ఆయన వివరణ ఇచ్చారు.

ఇదిలావుండగా, ”నాటోలోకి ఆహ్వానించడానికి లేదా ఉక్రెయిన్‌ సభ్యత్వానికి దేనికీ కాలపరిమితి నిర్ధారించకపోవడం అనూహ్యమైనది, అసంబద్ధమైనది” అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు.  అదే సమయంలో ఉక్రెయిన్‌ను ఆహ్వానించడానికి కూడా షరతులు అనే ఒక పదాన్ని అస్పష్టంగా చేర్చారని ఆయన విమర్శించారు.

నాటో-ఉక్రెయిన్‌ కౌన్సిల్‌ ప్రారంభ సమావేశానికి జెలెన్‌స్కీ బుధవారం హాజరయ్యారు. నాటోకి ఉక్రెయిన్‌ను మరింత దగ్గరగా ఎలా తీసుకురావాలనే విషయమై నాటో సభ్య దేశాలు చీలిపోయాయి.  ఉక్రెయిన్‌ ఎప్పుడు చేరుతుందో స్పష్టమైన హామీ ఇవ్వాలని కొన్ని  తూర్పు ఐరోపా దేశాలు కోరుతుండగా, అమెరికా, జర్మనీ మాత్రం వివరణ ఇవ్వడానికి విముఖత చూపుతున్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత నుండి అత్యంత సమగ్ర రీతిలో రక్షణ ప్రణాళికలను నాటో నేతలు ఆమోదించారని స్టోలెన్‌బర్గ్‌ తెలిపారు. కొత్త రక్షణ కార్యాచరణ ప్రణాళికను కూడా ఆమోదించారు.  ఈ కొత్త ప్రణాళికల కింద ఏటా రక్షణ రంగంలో తమ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం 2శాతానిు పెట్టుబడిగా పెట్టేందుకు నాటో మిత్రపక్షాలు ఆమోదం తెలిపాయి.

సైనికీకరణపై ఇలా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల సభ్య దేశాల మధ్య ఆయుధ పోటీ పెరుగుతుందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. సామాజిక, ఆర్థికాభివృద్ధి రంగాల నుండి వనరులను మళ్లించడానికి దారితీస్తాయనాురు. ప్రజల జీవిత నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. అయితే, యుక్రెయిన్ కు ఘనమైన “రాజకీయ, వాస్తవమైన” ప్యాకేజీ మాత్రం నాటో దేశాలు అందీయనున్నల్టు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకేన్ తెలిపారు. సభ్యతంతో పాటు ఉక్రెయిన్ కు ఆచరణ యోగ్యమైన మద్దతు ఆడించేందుకు తామంతా ఐక్యంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.