ఫ్రాన్స్ లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం

రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్యారిస్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ స్వాగతం పలికారు. ప్యారిస్ లోని ప్రవాస భారతీయులు మోదీకి త్రివర్ణ పతాకాలతో స్వాగతం పలికారు. శుక్రవారం బాస్టిల్ డే వేడుకలో పాల్గొని, గౌరవ వందనం స్వీకరించనున్నారు.
 
బస్టీల్‌ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్‌లో ఆ దేశ బలగాలతో కలిసి భారత సాయుధ దళాలు కూడా పాల్గొననున్నాయి. రక్షణ, అంతరిక్ష, మౌలిక, సాంస్కృతిక రంగాలతోపాటు వివిధ విభాగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. ఈ మేరకు రెండు నెలలక్రితం మాక్రాన్‌ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారు.
 
ఫ్రాన్స్ ప్రధానితో పలు కీలక అంశాలపై చర్చించనునన్నారు. రక్షణ ఒప్పందాలపై సంత‌కాలు చేయ‌నున్నారు. ‘ప్యారిస్ లో అడుగుపెట్టాను. ఈ పర్యటన ద్వారా భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నా కార్యక్రమాలలో భాగంగా భారతీయులతోను భేటీ అవుతున్నాను’ అని ప్యారిస్ లో దిగిన అనంతరం మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు భారత నేవీ కోసం ఫ్రాన్స్‌ నుంచి 26 రాఫెళ్లు, 3 సబ్‌మెరైన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం మోదీ పర్యటన సందర్భంగా కుదిరే సూచనలున్నాయి. గురువారం సాయంత్రం ఫ్రెంచ్ ప్రధాని ఎలిజిబెత్ బోర్నెతో సమావేశమవనున్నారు. సెనేట్ సందర్శనలో భాగంగా సెనేట్ ప్రెసిడెంట్ గెర్రార్డ్ లార్చర్‌తో భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రఖ్యాత లా సెనె మ్యూజికలెలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

ఐరాసలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే

కాగా, భారత దేశానికి తగిన గౌరవం దక్కాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పేర్కొంటూ ఇది కేవలం విశ్వసనీయతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, అంతకన్నా ఎక్కువ అని చెప్పారు. ఫ్రెంచ్ పబ్లికేషన్ లెస్ ఎకోస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఈ అంశం కేవలం విశ్వసనీయతకు సంబంధించినది మాత్రమే కాదు, మరింత విస్తృతమైనది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోని అత్యధిక జనాభాగల దేశం, అతి పెద్ద ప్రజాస్వామిక దేశం శాశ్వత సభ్యురాలు కానపుడు తాను ప్రపంచం కోసం మాట్లాడుతున్నానని ఆ మండలి ఏ విధంగా చెప్పుకోగలుగుతుంది?’’ అని ప్రశ్నించారు. 

మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా లేని వ్యవస్థకు సరైన ఉదాహరణగా భద్రతా మండలి నిలుస్తోందని ప్రధాని అసహనం వ్యక్తం చేశారు.  పక్షపాతంతో కూడిన సభ్యత్వం పారదర్శకత లేని నిర్ణయీకరణ ప్రక్రియలకు దారి తీస్తోందని ఆయన తెలిపారు. నేటి సవాళ్ల పరిష్కారంలో నిస్సహాయతకు ఇది తోడవుతోందని చెప్పారు. 

భద్రతా మండలిలో ఎలాంటి మార్పులు జరగాలి? భారత దేశం ఎలాంటి పాత్ర పోషించాలి? అనే అంశాలపై అత్యధిక దేశాలకు స్పష్టత ఉందని చెబుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్ కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ప్రధాని గుర్తు చేశారు.