ఎంఎంటిఎస్ లో 40 నిముషాల్లో యాదాద్రికి

ఎంఎంటిఎస్ లో 40 నిముషాల్లో యాదాద్రికి

హైదరాబాద్ నగరం నుంచి యాదాద్రికి ఎంఎంటిఎస్ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదాద్రికి వెళుతుండడం, నగరంలో ట్రాఫిక్ సమస్య కారణంగా గంటన్నర పాటు నగరం దాటేందుకు సమయం పడుతోంది. దీంతోపాటు బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

దాంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంఎంటిఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తే భక్తులకు ఇబ్బందులు తప్పుతావని దక్షిణ మధ్య రైల్వే భావిస్తున్నది. మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే హైదరాబాద్ నుంచి రూ.20ల టిక్కెట్‌తో యాదాద్రికి వెళ్లే అవకాశం లభిస్తుంది.  నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోవడంతో పాటు 40 నిమిషాల్లోనే యాదాద్రికి చేరుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు.

ప్రస్తుతం ఎంఎంటిఎస్ రెండోదశ పనులు జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే మౌలాలి నుంచి ఘట్‌కేసర్ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు లైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది చివరికల్లా ఆ పనులు పూర్తి చేయాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, యాదాద్రి వరకు లైన్ పొడిగింపు మాత్రం వచ్చే సంవత్సరం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఎంఎంటిఎస్ రైళ్లను రాయగిరి (యాదాద్రి) స్టేషన్ వరకు పొడిగించాలని ఆరేళ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. మౌలాలి నుంచి ఘట్‌కేసర్ వరకు రైళ్లు ఉండగా అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 

ఇటీవల కేంద్రం యాదాద్రికి ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేసింది. ఎంఎంటిఎస్ రెండో దశకు కేంద్రం రూ. 330 కోట్లు నిధులు ఖర్చు చేస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఘట్‌కేసర్‌రాయగిరి లైన్ పూర్తి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికోసం అయ్యే ఖర్చును కేంద్రమే భరించనున్నట్లు తెలిపింది.