ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.  ప్రత్యేకించి పర్యాటక కేంద్రం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా మారింది. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా హిమాచల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
 
గత మూడు రోజులుగా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. మృతి చెందిన 30 మందిలో ఇప్పటి వరకు 29 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు భారీ వర్షం కారణంగా సంభవించిన వరదలకు సుమారు రూ.3,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదిలో నీటి ప్రవాహం ప్రమాద స్థాయిని మించడంతో మంగళవారం పాత యమునా నది వంతెనపై రైళ్ల రాకపోకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. యమునా నదిలో ప్రమాద స్థాయి 205.33 మీటర్లు కాగా ప్రస్తుత నీటి ప్రవాహ స్థాయి 206.24 మీటర్లకు చేరుకుంది.

వదర స్థాయి 207.49 మీటర్లని కేంద్ర జల మండలి అధికారులు చెప్పారు. హర్యానాలో కూడా భారీ వర్షాలు పడుతుండడంతో హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి సోమవారం 15,677 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో నీటి మట్టం బాగా పెరిగిపోయింది.

వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో చందర్తాల్, పాగల్ నల్లా, లాహౌల్, స్పితి సహా పలు ప్రాంతాల్లో సుమారు 500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఇక ఉనా జిల్లాలోని మురికివాడను వరదలు ముంచెత్తాయి. అందులో చిక్కుకుపోయిన 515 మంది కార్మికులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సురక్షితంగా రక్షించారు.

మరోవైపు రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖ్ ప్రజలను హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వరదల కారణంగా చిక్కుకుపోయిన పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

‘రాష్ట్రంలో ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాలు వంటి కారణాల వల్ల 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా ప్రాణనష్టం అంత ఎక్కువగా లేదు. ప్రధాన రహదారులు, లింక్ రోడ్లతో సహా 1,300 రోడ్లు దెబ్బతిన్నాయి. రాబోయే రెండు రోజులు అలర్ట్ గా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి పేర్కొన్నారు.