సుడాన్ లో పూర్తి స్థాయి పౌర యుద్ధం పెచ్చరిల్లే ముప్పు

ఆఫ్రికా దేశమైన సూడాన్‌ సైన్యం, పారామిలిటరీ మధ్య ఘర్షణతో అట్టుకుతున్నది. రెండు దళాలకు చెందిన అధిపతుల మధ్య విభేదాలతో దేశం నరక కూపంగా మారిపోతున్నది. గత 12 వారాలుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.  సుడాన్ లో పూర్తి స్థాయి పౌరయుద్ధం పెచ్చరిల్లే ముప్పు ముంగిట సూడాన్‌ వుందని ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటానియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
దాదాపు మూడు మాసాలుగా సూడాన్‌లో ఘర్షణలు కొనసాగుతునే వున్నాయి. రాజధాని ఖార్టూమ్‌లో ఆదివారం కూడా ప్రత్యర్ధి సైనిక జనరల్స్‌ మధ్య ఘర్షణలు భీకరంగా కొనసాగాయి.  సూడాన్‌ మిలటరీ, శక్తివంతమైన పేరా మిలటరీ బలగాల మధ్య జరుగుతున్న పోరాటంతో దేశం మొత్తంగా అస్థిరమయ్యే ప్రమాదం వుందని  ఆయన హెచ్చరించారని గుటెరస్‌ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ తెలిపారు.
ఏప్రిల్‌ మధ్యలో ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన ఈ ఘర్షణలు అనతికాలంలోనే బహిరంగా పోరాటంగా మారిపోయాయి.  ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 3వేల మందికి పైగా మరణించారని, 6 వేల మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య మంత్రి హైతమ్‌ ఇబ్రహీమ్‌ తెలిపారు. కానీ అనధికారికంగా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే వుండే అవకాశం వుంది. రాజధానితోపాటు కోర్డోఫాన్‌, డార్ఫర్‌ ప్రాంతాల్లో కూడా ఘర్షణలు కొనసాగుతున్నాయి.
 
 సూడాన్‌లోనే 29లక్షల మందికి పైగా ప్రజలు తమ ప్రాంతాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వీరిలో  సుమారు 7 లక్షల మంది పొరుగు దేశాలకు వలసవెళ్లారు. 2021 అక్టోబరులో సైనిక కుట్రలో అక్కడి పౌర ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 18మాసాలకు ఈ ఘర్షణలు చోటు చేసుఉన్నాయి.  దీంతో శాంతియుతంగా ప్రజాస్వామ్య క్రమానికి బదిలీ కాగలమన్న ప్రజల ఆశలు చెల్లాచెదురయ్యాయి.
 
తాజాగా పశ్చిమ ఒండుర్మాన్‌పై  సైన్యం జరిపిన వైమానిక దాడిలో 22 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. రాజధాని ఖార్టూమ్‌  జంటగనరమైన ఒండుర్మన్‌, బహ్రీలలో ఏప్రిల్‌లో జరిగిన పోరాటంలో పారామిలిటరీ దళాలు ఆధిపత్యం చెలాయించాయి. దీంతో సైన్యం వైమానిక దాడులు జరుపుతున్నది.
గత నెలలో ఖార్టూమ్‌పై జరిగిన వైమానిక దాడిలో సుమారు 17 మంది చనిపోయారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. కాగా, ఒండుర్మన్‌లోని నివాస ప్రాంతాలపై సైన్యం వైమానిక దాడులు చేయడంతోనే ఎక్కువ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తున్నదని పారామిలిటరీ బలగాలు ఆరోపిస్తున్నాయి.