ఈటెల, అర్వింద్‌లకు కేంద్రం బద్రత

తెలంగాణలో ఇద్దరు బీజేపీ కీలక నేతలకు కేంద్రం భద్రత కల్పించింది. మాజీ మంత్రి, ఎమ్యెల్యే ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్‌ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. 
 
హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటలకు ‘వై’ ప్లస్ భద్రతను కేటాయించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మందితో భద్రతా సిబ్బంది రక్షణగా ఉండనున్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. 
 
అర్వింద్‌కు సెక్యూరిటీగా ‘వై’ కేటగిరీలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. సోమవారం ఈటల, అరవింద్ నివాసాలకు కేంద్ర భద్రతా బలగాలు వెళ్లనున్నారు.  ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ప్రాణహానీ ఉందంటూ ఈటల రాజేందర్‌తో పాటు ఆయన సతీమణి చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. 
 
బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ నేత రాజేందర్‌ను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇందుకోసం రూ.20 కోట్లు సుపారీ తీసుకున్నట్లు ఈటల సతీమణి ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈటల భద్రతపై ఆరా తీశారు. 
 
అలాగే డీజీపీకి ఫోన్ చేసి ఈటల భద్రతపై కూడా చర్చించారు. మంత్రి ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి ఒకరు ఈటల ఇంటికి వెళ్లి భద్రతపై మాట్లాడారు. ఇదిలా ఉండగా ఈటల రాజేందర్ కూడా ఈ విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈటలకు భద్రతను కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అలాగే అటు ఎంపీ ధర్మపురి అరవింద్‌ కూడా కేంద్ర హోంశాఖ వై కేటగిరి భద్రతను కేటాయించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గులాబీ శ్రేణులు భగ్గుమన్నారు. ఎంపీ ఇంటిపై కవిత అనుచరులు దాడి చేసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీకి కూడా కేంద్ర భద్రతను కేటాయించింది.