ఉమ్మడి పౌరస్మృతిపై మజ్లీస్ కు కేసీఆర్ లొంగుబాటు

కేసీఆర్ ప్రభుత్వం మజ్లీస్ వత్తిడులకు లొంగిపోతుండటం మరోసారి వెల్లడైంది.ఏఐఎంఐఎం అధినేత,  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సారధ్యంలో ఓ ముస్లిం బృందం వచ్చి కలవగానే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిని తాము కూడా వ్యతిరేకిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం ప్రకటించారు.
 
ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రితో సమావేశం కాగానే ఈ విషయంలో తాము వారితోనే ఉంటామని అంటూ కేసీఆర్ భరోసా ఇచ్చారు.  కనీసం ఈ విషయమై తమ పార్టీలో గాని, మంత్రివర్గంలో గాని చర్చించి నిర్ణయం తీసుకుంటామనే మాటకూడా చెప్పక పోవడం గమనార్హం.
 
విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని, అందులో భాగంగానే ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును వ్యతిరేకిస్తున్నామని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
 
రాబోయే పార్లమెంటు సమావేశాల్లో యుసిసి బిల్లును బిఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అంతే కాకుండా భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుపోతూ యు.సి.సి బిల్లుపై పోరాడుతామని సిఎం స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.
 
ఉమ్మడి పౌరస్మృతి వస్తే ముస్లింలతో పాటు హిందువులకూ నష్టం జరుగుతుందని అసదుద్దీన్ ఓవైసి ఈ సందర్భంగా హిందువుల పట్ల సానుభూతి ప్రదర్శించే ప్రయత్నం చేశారు. యూసిసి పేరుతో దేశంలో లౌకికవాదాన్ని దేబ్బతీసే కుట్ర జరుగుతోందని అంటూ ఆయన `లౌకికవాదం’ గురించి మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది.
 
కొద్దీ రోజుల క్రితమే కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ, వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ప్రకటించిన ఒవైసీ ఇప్పుడు కేసీఆర్ కు ఉమ్మడి పౌరస్మృతి గురించి `మార్గనిర్ధేశం’ చేయడం గమనార్హం. మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే ఒవైసి చెప్పిన్నట్లు కేసీఆర్ నడచుకోవడం అనివార్యంగా కనిపిస్తున్నది.