ఒడిశా రైలు ప్రమాదంలో మరో ముగ్గురు అధికారుల అరెస్ట్

భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో  ఒడిశాలో మూడు రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొని 291 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) దర్యాప్తు కొనసాగుతున్నది. సంబంధిత రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సీబీఐ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ మేరకు ఎవరు బాధ్యులనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నది.

ప్రమాదానికి బాధ్యులుగా గుర్తించిన ముగ్గురు రైల్వే అధికారులను శుక్రవారం సాయంత్రం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ అరుణ్‌ కుమార్‌ మొహంతా, సెక్షన్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ అమీర్‌ ఖాన్‌, టెక్నీషియన్‌ పప్పూకుమార్‌ ఉన్నారు. 

ఇండియన్ పీనల్‌ కోడ్‌లోని 304, 201 సెక్షన్‌ల ప్రకారం నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ తెలిపింది. వారి నిర్లక్ష్యపు చర్యలే రైలు ప్రమాదానికి కారణమయ్యాయని పేర్కొంది. కాగా, ఈ ఘటన జరిగి నెల రోజులు గడిచిపోయినా, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తికాలేదు. చనిపోయిన వారిలో ఇంకా 42 మందికి సంబంధించిన వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు.

ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అందులో కొన్నింటిని గుర్తించి వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన 81 మృతదేహాలకు ఇటీవలే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అందులో 39 మంది మృతదేహాలను గుర్తించి వాటిని దహన సంస్కారాల నిమిత్తం వారి కుటుంబాలకు అప్పగించారు. ప్రస్తుతం 42 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.

ఆ 42 మృతదేహాలకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. వారి బంధువులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం వాటిని భువనేశ్వర్ ఎయిమ్స్ మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆ డెడ్ బాడీస్ కు నిర్వహించిన డీఎన్ఏ రిపోర్ట్స్ త్వరలో రానున్నట్లు అధికారులు వెల్లడించారు.