మణిపూర్‌లో స్కూల్‌ వెలుపల మహిళ కాల్చివేత

మణిపుర్‌లో ఇంకా హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ఓ స్కూల్ బయట గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కాల్చి చంపిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఇంపాల్ పశ్చిమ జిల్లాలోని స్థానిక శిశు నిష్తా నికేషన్ స్కూల్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకోగా, మృతురాలి పేరు, వివరాలు తెలియరాలేదు. 

జాతుల వైరం నేపథ్యంలో మణిపుర్ లో రెండు నెలలుగా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. అల్లర్ల కారణంగా గత రెండు నెలలుగా స్కూల్స్ మూతపడ్డాయి. తాజాగా బుధవారం స్కూల్స్ తెరుచుకోగా, మరుసటి రోజునే ఓ పాఠశాల ఎదుట ఈ దారుణం జరిగింది. ఇప్పటికే విద్యార్థులు పాఠశాలలకు రావడానికి భయపడుతున్నారు. 

ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడంతో మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. మణిపుర్ లో మే 3వ తేదీ నుండి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.  కాగా, కాంగ్‌పోక్‌పి జిల్లాలోని మాపావో, అవాంగ్ సెక్మై ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా బలగాలు ఈ ఘర్షణను నివారించాయి. 

అలాగే తౌబాల్ జిల్లాలో మరో హింసాత్మక సంఘటన జరిగింది. పోలీస్‌ ఆయుధ డిపో నుంచి తుపాకులు దోచుకునేందుకు అల్లరిమూకల ప్రయత్నించగా ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బీ) సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లరిమూకలు ఆ సిబ్బంది ఇంటికి నిప్పు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా, దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై మణిపుర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఈ సేవలను పునరుద్ధరించే అంశంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది పెండింగ్ లో ఉన్న కారణంగా జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.