సిసోడియాతో సహా నిందితుల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ  సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు సీజ్ చేసింది. 

జప్తు చేసిన ఆస్తుల్లో సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియాకు చెందిన రెండు ఆస్తులు, రూ.11 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ కేసులో నిందితులైన వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్ దల్, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి ఆస్తులను కూడా ఈడీ సీజ్ చేసింది. ఈడీ సీజ్ చేసిన ఆస్తుల్లో రూ.44.29 కోట్ల చరాస్తులు, భూములు కూడా ఉన్నాయి.

ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీ లాండరింగ్ కేసులో గత మార్చిలో అరెస్టయిన సిసోడోయా ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోరుతూ గత గురువారంనాడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సిసోడియా సన్నిహితుడైన ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరాను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఈడీ ఈ చర్యలు చేపట్టింది.

కాగా, ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఎక్సైజ్‌ పాలసీపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాది సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాతోపాటు పలువురిపై అవినీతి ఆరోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. లిక్కర్‌ పాలసీలోని ఆర్థిక అవకతవకలపై ప్రత్యేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నది. 

ఇందులో భాగంగా మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం జప్తు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ కింద లిక్కర్ వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేసి, అందుకు ప్రతిగా భారీగా ముడుపులు అందుకున్నట్టు ఈడీ, సీబీఐ ఆరోపణగా ఉంది.

అప్రూవర్ అరోరా అరెస్ట్

తొలుత సీబీఐ కేసులో అరెస్టయి, ఆ తర్వాత అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరాను తాజాగా ఈడీ అరెస్టు చేసింది. అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని స్పెషల్ కోర్టులో అరోరాను హాజరుపరిచి, వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరింది. న్యాయస్థానం 4 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న దినేశ్ అరోరాను కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆదేశించింది. కస్టడీ కోరుతూ వాదనలు వినిపించిన ఈడీ  దినేశ్ అరోరా కొన్ని విషయాలు దాస్తున్నారని ఆరోపించింది. 

అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించి ఆ విషయాలు రాబట్టాలనుకుంటున్నామని తెలిపింది. నాటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కోసం అమిత్ అరోరాతో పాటు దినేశ్ అరోరా కలిసి రూ. 2.20 కోట్లు చేరవేశారని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ ఆధారాలున్నాయని వెల్లడించింది.