వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్- కాంగ్రెస్‌ లను అడ్రస్ లేకుండా చేస్తాం

2021 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్- కాంగ్రెస్‌ పార్టీలను అడ్రస్ లేకుండా చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప సభ’లో పాల్గొన్న మోదీ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భద్రకాళి మహత్యం, సమ్మక్క సారక్క పౌరుషం, రాణి రుద్రమ పరాక్రమం’ అంటూ మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. 
 
చారిత్రక వరంగల్ రావటం ఎంతో సంతోషంగా ఉందని చెబుతూ విజయ సంకల్ప వచ్చిన జన్నాన్ని చూస్తుంటే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం కలుగుతుందని తెలిపారు.  ‘‘కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్‌ చూపించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేస్తాం” అని స్పష్టం చేశారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
 
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెబుతూ తెలంగాణలో కుటుంబ పార్టీలు అవినీతికి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిని పెంచి పోషిస్తోందని అంటూ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దే అని విమర్శించారు. 9 ఏళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. యువత, ప్రజలను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొంటూ అవినీతి లేకుండా తెలంగాణలో ఏ పని జరగట్లేదని ప్రధాని ధ్వజమెత్తారు.

“తెలంగాణ అభివృద్ధే బీజేపీ లక్ష్యం. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో తెలంగాణ పాత్ర కీలకం. కాజీపేట వ్యాగన్ ప్యాక్టరీ రైల్వే విస్తరణకు ఎంతో కీలకం. రామగుండంలో యూరియా కర్మాగారాన్ని పునఃప్రారంభించాం” అని ప్రధాని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో నాలుగే పనులు చేసిందని మోదీ చెప్పారు. 
 
పొద్దున్న లేస్తే కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుందని, కుటుంబాన్ని పెంచిపోషించుకోవటమే బీఆర్ఎస్ సర్కార్ చేసిన పని అని, తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతిని పెంచి పోషించిందని, కేసీఆర్ సర్కార్ స్కాముల్లో కూరుకుపోవడంతో ప్రతి ప్రాజెక్టు అవినీతిమయమే అంటూ ప్రధాని విరుచుకు పడ్డారు.
 
కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందంటూ ఢిల్లీ లిక్కర్ స్కాంను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవితపై ప్రధాని పరోక్ష విమర్శలు చేశారు. ఎక్కడైనా అభివృద్ధి కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని, కానీ అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. దీని కోసమేనా యువత ఆత్మబలిదానాలు చేసిందని మోదీ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని స్పష్టం చేశారు.
 
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, కేంద్ర నిధులను గ్రామ పంచాయితీలకు అందకుండా చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. దళితులతో పాటు అన్ని వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అవినీతి దేశమంతా తెలుసని చెబుతూ తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రమాదకరమని మోదీ హెచ్చరించారు. 
 
ఉద్యోగాలిస్తామని యువతను మోసం చేశారని అంటూ వేలాది ఖాళీలను భర్తీ చేయకుండా తమాషా చేస్తున్నారని ప్రధాని దుయ్యబట్టారు. అవినీతి నుంచి దృష్టిమరల్చేందుకు కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  “వేల కోట్ల రూపాయలతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఓ బీజేపీ కార్యకర్తగా మీ మధ్యకు వచ్చాను. పౌరుషానికి వరంగల్ నగరం ప్రతీక. జన్ సంఘ్ నుంచి వరంగల్ మాకు కంచుకోట. దేశంలో బీజేపీకి 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు అందులో జంగారెడ్డి ఒక్కరు” అని గుర్తు చేసుకున్నారు.
 
తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నేషనల్ హైవేలు నిర్మిస్తున్నామని పేర్కొంటూ తెలంగాణ ఆర్థిక హబ్‌గా మారుతోందని మోదీ చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  “తెలంగాణ అభివృద్ధే మా లక్ష్యం. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఎంతో కీలం. మేడిన్ ఇండియాకు తెలంగాణ ఎంతో సాకారం అందించింది. గతంలో పోల్చితే తెలంగాణకు అనేక పెట్టుబడులు వచ్చాయి. ఆ ప్రయోజనం యువతకు దక్కుతుంది” అని ప్రధాని భరోసా ఇచ్చారు.
కుటుంబ పార్టీల డీఎన్ఎ మొత్తం అవినీతిమయం అంటూ ప్రధాని మోదీ విరుచుకు పడ్డారు.  ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అనేక మాటలు చెప్పిందని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ స్కామ్ అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. జనాల నమ్మకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని… అవన్నీ మోసాలే అని ధ్వజమెత్తారు.