మణిపూర్ పరిస్థితిపై కలుగుచేసుకుంటామని అమెరికా రాయబారి చెప్పడంపై భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణంగా ఇతర దేశాల వ్యవహారాలలో వేరే దేశం దౌత్యవేత్తలు మాట్లాడటం అనుచితం అవుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ విషయం అమెరికా రాయబారికి కూడా తెలిసే ఉంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం పేర్కొన్నారు.
మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారిక సంస్థలు పాటుపడుతున్నాయని ఆయన చెప్పారు. అమెరికా రాయబారి ఆ విధంగా మాట్లాడినట్లు తనకు నేరుగా తెలియదని, అయితే అటువంటి వ్యాఖ్యలకు దిగినట్లు నిర్థారణ అయితే దీనిపై తగు విధంగా స్పందిస్తామని బాగ్చీ స్పష్టం చేశారు. అయితే, పూర్తిస్థాయి నిర్థారణ లేకుండా వీటిపై మాట్లాడటం కుదరదని చెప్పారు.
కాదా, మీడియా కధనాల ప్రకారం మణిపూర్ అల్లర్లను ఎదుర్కోవడానికి భారత్ అడిగితే సాయం చేయడానికి సిద్ధమే అని భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి గురువారం వ్యాఖ్యానించారు. ఆయన కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్‌లో జరిగిన మీడియా సమావేశంలో గార్సెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మణిపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల వెనుక మానవీయ కారణాలున్నాయని నేను భావిస్తున్నాను. ఈ ఆందోళలను ఎదుర్కోవడానికి భారత్ అడిగితే సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ అంశం భారత్ అంతర్గత వ్యవహారమే అయినా… ఆందోళనలపై స్పందించడానికి భారతీయుడే కానక్కర్లేదు’ అని తెలిపారు.
మణిపూర్‌లో తక్షణమే శాంతి నెలకొనాలని పేర్కొంటూ శాంతియుత వాతావరణం ఉంటేనే పరస్పర సహకారం, ప్రాజెక్టులు, పెట్టుబడులు తీసుకురాగలమని ఆయన పేర్కొన్నారు. ఇక గార్సెట్టి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత అంతర్గత వ్యవహారాలపై ఓ అమెరికా రాయబారి వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి అని ఆయన విమర్శించారు.
అమెరికాలో తుపాకీ కాల్పుల ద్వారా పలువురు మృతి చెందుతున్నారని, కానీ కాల్పులను కట్టడి చేయడం గురించి భారత్ నుండి నేర్చుకోమని భారత్ ఎప్పుడూ చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. బహుశా, భారత్ – అమెరికా సంబంధాల చరిత్ర గురించి తెలుసుకోవడం అమెరికా నూతన రాయబారి అవసరమని ఆయన హితవు చెప్పారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!