తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి

ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జిలుగా కొలీజియం బుధవారం సిఫారసు చేసింది. ప్రస్తుతం జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.  జస్టిస్‌ భట్టి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
కాగా,  బొంబాయి. గుజరాత్‌, తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసు చేసింది. ఒడిశా, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం బుధవారం సమావేశమై చర్చించారు.కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత మహిళా న్యాయమూర్తి సునీతా అగర్వాల్ గుజరాత్ హైకోర్టు బాధ్యతలు చేపట్టనున్నారు.
కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తులందరూ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా సరిపోతారని పేర్కొంది. అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ్‌ పేరు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది. అలాగే గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్‌ హైకోర్టు జడ్జి సునీతా అగర్వాల్‌ పేరును సూచించింది.
కర్ణాటక హైకోర్టు జస్టిస్‌ అలోక్‌ ఆరాధే పేరును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు జడ్జి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌ పేరును మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించింది. అలాగే ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాసిష్‌ తలపత్ర (ఒడిశా), గుజరాత్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఆశిష్‌ జే దాసాయి పేరును కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా కేంద్రానికి సిఫారసు చేసింది.
జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ అక్టోబర్‌ 17, 2011న గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు.  గతేడాది జూన్‌ 28న ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.  హైకోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘ పదవీకాలంలో జస్టిస్ భుయాన్ వివిధ న్యాయ రంగాల్లో గణనీయమైన అనుభవం ఉన్నది. ఆయన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగాను సేవలందించారు.
జస్టిస్‌ భట్టి ఏప్రిల్‌ 12, 2013న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. మార్చి 2019లో కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం జూన్‌ 1, 2023 నుంచి ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్‌ కృష్ణ మురారి ఈ నెల 7 పదవీ విరమణ చేయనుండగా.. ఖాళీల సంఖ్య నాలుగుకు చేరనున్నది.