9 సారి భారత్ కు శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌-2023 టైటిల్‌

శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌-2023 టైటిల్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారతజట్టు రికార్డుస్థాయిలో 9వ సారి ముద్దాడింది. బెంగుళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఛెత్రీ సేన పెనాల్టీ షూటౌట్‌లో 5-4గోల్స్‌ తేడాతో కువైట్‌పై విజయం సాధించింది.  నిర్ణీత, అదనపు సమయం పూర్తయ్యే సరికి ఇరుజట్లు 1-1గోల్స్‌తో సమంగా నిలిచాయి.
కువైట్‌ తరఫున గోల్‌ను షబీబ్‌ అల్‌-ఖల్దీ(14వ ని.)లో కొట్టాడు. భారత్‌ తరఫున గోల్‌ను ఛిహంగేల్‌(38వ ని.)లో చేశాడు. దీంతో ఇరుజట్లు తొలి అర్ధభాగంలోనే ఒక్కో గోల్‌ కొట్టాయి.  రెండో అర్ధభాగంలో కువైట్‌ జట్టు బంతిని ఎక్కువ సమయం తమ ఆధీనంలోనే పెట్టుకొన్నా.. భారత రక్షణశ్రేణి సమర్ధవంతంగా నిలువరించింది. రెండు మూడుసార్లు కువైట్‌కు, ఒకటి, రెండుసార్లు భారత్‌కు గోల్‌కొట్టే సువర్ణావకాశాలు లభించినా ప్రయోజనం లేకపోయింది. 
 
ఇక అదనపు సమయంలో ఇరు జట్లు గోల్‌ చేసేందుకు పోటా పోటీగా తలపడ్డా గోల్‌ చేయ లేక పోయాయి. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌లను నిర్దేశించగా.. తొలి ఐదు గోల్స్‌ పూర్తయ్యేసరికి ఇరుజట్లు 4-4 గోల్స్‌తో సమంగా నిలిచాయి.  ఆ తర్వాత నాకౌట్‌లో భారత్‌ తొలుతే ఒక గోల్‌ చేయగా.. కువైట్‌ ఆటగాడు కొట్టి గోల్‌ను భారత గోల్‌ కీపర్‌ గుర్‌ప్రీత్‌ అద్భుతంగా నిలువరించి బంతిని గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా అడ్డు కున్నాడు.
దీంతో భారత్‌ 5-4గోల్స్‌ తేడాతో గెలిచి టైటిల్‌ను మరోమారు ముద్దాడింది.  సెమీఫైనల్లో నూ భారతజట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-2గోల్స్‌ తేడాతో పటిష్ట లెబనాన్‌ను, కువైట్‌ జట్టు 1-0తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకొ చ్చిన సంగతి తెలిసిందే. లీగ్‌ దశలో గ్రూ ప్‌-ఏలో భారత జట్టు నేపాల్‌, పాకిస్తాన్‌ పై గెలిచి, కువైట్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకొంది. 
 
ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారతజ ట్టు 100, కువైట్‌141 ర్యాంక్‌లో ఉన్నాయి. గోల్డెన్‌ బూట్‌, గోల్డెన్‌ బాల్‌ భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీకి లభించాయి. విజేతకు రూ.41లక్షలు(50వేల డాలర్లు), రన్నరప్‌ కువైట్‌ జట్టుకు రూ.20.50 లక్షలు(25వేల డాలర్లు) ప్రైజ్‌మనీ దక్కింది. ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు సుమారు 30వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు.