నిర్మాణంలో కోల్‌కతా- బ్యాంకాక్ రహదారి మార్గం

భారతదేశం నుండి బ్యాంకాక్‌కు రోడ్ మార్గంలో వెళ్లడానికి రహదారి సిద్దం అవుతోంది. 3 దేశాలు కలిసి నిర్మిస్తున్న భారత్-బ్యాంకాక్‌ రహదారి త్వ‌ర‌లోనే పూర్తి కానుంది. దాదాపు 1,360 కి.మీ పొడవుతో భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ సంయుక్తంగా నిర్మిస్తున్న కోల్‌కతా-బ్యాంకాక్ హైవేతో ఈ ప్ర‌యాణం సాధ్యమవ్వ‌నుంది.

ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ భారత్- మయన్మార్-థాయ్‌లాండ్ హైవే దాదాపుగా 70 శాతం పూర్తయిందని చెప్పారు. ఈ త్రైపాక్షిక జాతీయ రహదారికి సంబంధించి మణిపూర్ రాజధాని ఇంఫాన్ నుంచి మోరే వరకు ఉన్న సెక్షన్.. ఈ ఏడాది చివరి వరకు పూర్తి అవుతుందని పేర్కొన్నారు. మూడు దేశాలు నిర్మిస్తున్న ఈ హైవే పనులు పూర్తయిన తర్వాత, కోల్‌కతా నుండి బ్యాంకాక్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించే వీలు ఉంటుంది.

భారత్ నుంచి థాయిలాండ్‌కు రోడ్డు మార్గం నిర్మించాలని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ తొలిసారి ప్రతిపాదించారు. దీనికి సంబంధించి 2002 ఏప్రిల్ నెలలో భారత్, మయన్మార్, థాయిలాండ్ దేశాలకు చెందిన మంత్రుల స్థాయి సమావేశంలో ఆమోదం తెలిపారు. భారత్ – మయన్మార్ – థాయిలాండ్ త్రైపాక్షిక జాతీయ రహదారి పొడవు 1400 కిలోమీటర్లు. ఈ 1400 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిని 2019 వరకు పూర్తి చేయాలని అప్పట్లో ప్రతిపాదించారు.

అయితే వివిధ కారణాల వల్ల ఈ జాతీయ రహదారి నిర్మాణం ఆలస్యమైంది.ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తైన త‌రువాత‌  లావోస్, కంబోడియా, వియత్నాం ప్రాంతాలకు త్రైపాక్షిక రహదారిని విస్తరించాలని భారతదేశం యోచిస్తోంది. మణిపూర్‌లోని భారత్- మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోర్ అనే ప్రదేశం నుంచి భారత్- మయన్మార్- థాయ్‌లాండ్ హైవే ప్రారంభమవుతుంది.

భారత్ – మయన్మార్ – థాయిలాండ్ వరకు ఉన్న పూర్తి జాతీయ రహదారి మరో 3 నుంచి 4 ఏళ్లలో పూర్తి అవుతుందని థాయిలాండ్ విదేశీ వ్యవహారాల ఉప మంత్రి విజావత్ ఇస్రభక్తి వెల్లడించారు. థాయిలాండ్‌ భూభాగంలోని 99 శాతం 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే పూర్తి అయిందని.. ఇక భారత్, మయన్మార్ భూభాగాల్లో ఉన్న జాతీయ రహదారిని ఆయా ప్రభుత్వాలు ఎప్పటి వరకు పూర్తి చేస్తాయో.. అంత త్వరగా ప్రాజెక్టు పూర్తి అవుతుందని విజావత్ ఇస్రభక్తి తెలిపారు.

ఈ ఎక్జైటింగ్ జ‌ర్నీ భారత్- మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోర్ నుండి మయన్మార్- థాయ్‌లాండ్ సరిహద్దులో ఉన్న మే సోట్ అనే అందమైన పట్టణానికి తీసుకెళ్తుంది. ఈ రహదారి ఈ మూడు దేశాలలో వాణిజ్య అవకాశాలను పెంపొందించడంతో పాటు పర్యాటక, సాంస్కృతిక సంబంధాలను సహితం బలోపేతం చేయగలదు. వందల సంవత్సరాల చరిత్ర గల పలు ప్రసిద్ధ దర్శనీయ స్థలాలు ఈ మార్గంలో ఉన్నాయి.