శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ వద్ద బీభత్సం

శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ పై పలువురు దుండగులు దాడికి దిగారు. శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న భారతదేశ కాన్సులేట్ వద్ద బీభత్సం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల నుండి రెండున్నర గంటల మధ్యలో భారత కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టారు. గత ఐదు నెలల కాలంలో కాన్సులేట్ పై జరిగిన రెండవ దాడిగా దీనిని చెబుతున్నారు.
 
ఖలిస్తానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లుగా సమాచారం. ఖలిస్తానీ మద్దతుదారులు గత మార్చి నెలలో కూడా భారత కాన్సులేట్ ను ధ్వంసం చేశారు. గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ సానుభూతిపరుడు అయిన అమృత పాల్ సింగ్ అరెస్టుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వివిధ దేశాల్లో ఉన్న ఖలిస్తాన్ అనుకూల పంజాబీలు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.
 
ఈ క్రమంలో ఇప్పటికే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ కార్యాలయంపై, కెనడాలోని దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వారిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ మరోసారి ఖలిస్తానీ మద్దతుదారులు భారత కాన్సులేట్ కు నిప్పు పెట్టి దానికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు జరిగినట్టు, ప్రాణ నష్టం జరిగినట్టు నివేదించబడలేదు. శాన్ ఫ్రాన్సిస్కో అగ్నిమాపక విభాగం మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది.
ఈ ఘటనపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ స్పందించారు. ఇటువంటి దహనం ప్రయత్నాలను, విధ్వంసాలను అమెరికా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలోని దౌత్య సౌకర్యాలు, విదేశీ దౌత్యవేత్తలపై విధ్వంసం, హింస క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
గతంలోనూ ఖలిస్తానీ మద్దతుదారులు అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఇనుప రాడ్ లతో భారత కాన్సులేట్ వద్ద విధ్వంసానికి పాల్పడ్డారు. కార్యాలయ గోడపై అమృత్ పాల్ ను వదిలెయ్యాలని గ్రఫిటీ పెయింట్ చేశారు. అక్కడ ఖలిస్తానీ మద్దతు బ్యానర్లను ఏర్పాటు చేశారు.