కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ వ్యయం భారీగా పెంచారన్న కాగ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రయోజనాలు ఎక్కువ చేసి చూపారని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని తెలిపింది. కేంద్ర జల సంఘం రూ.81,911 కోట్ల డీపీఆర్ కు ఆమోదించిందని, అయితే తాజా అంచనా ప్రకారం రూ.1,49,317 కోట్లుగా మారిందని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది.
 
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో 46.81 శాతం ఈ ఒక్క ప్రాజెక్టుకే అవసరమవుతుందని కాగ్ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిగా అధ్యయనం చేసి కాగ్‌ తన తుది నివేదిక ప్రకటించింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ముందు తక్కువ చేసి చూపించారని కాగ్ నివేదిక పేర్కొంది. ముందు రెండు టీఎంసీలతో చేపట్టినా ఈ ఎత్తిపోతల పథకాన్ని ఆ తర్వాత మూడు టీఎంసీలకు పెంచారని, దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.28,151 కోట్లు పెరిగిందని కాగ్ వ్యాఖ్యానించింది.

పాత ధరల అంచనాలతో డీపీఆర్‌ రూపొందించారని, తాజా నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొంటే ప్రతి ఎకరాకు మూలధన వ్యయం రూ.6 లక్షల 50 వేలు అవుతుందని కాగ్ నివేదిక తెలిపింది. ప్రతి ఏడాది విద్యుత్ ఛార్జీలకు రూ.10,374.56 కోట్లు అవసరం అవుతుందని కాగ్ పేర్కొంది. వీటన్నింటినీ లెక్కల్లోకి తీసుకుంటే ఎకరాకు నిర్వహణ ఖర్చు రూ.46,364 అవుతుందని తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.87,949 కోట్లు 7.8 శాతం నుంచి 10.9 శాతం వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకుందని కాగ్ నివేదికలో వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకొన్న రుణాలపై అదనంగా రూ. 8182 కోట్ల వడ్డీ పడింది. తిరిగి చెల్లించే గడువు వాయిదా వేయడంతో అదనపు భారం పడిందని కాగ్ నివేదిక పేర్కొంది. 14 ఏళ్లలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అసలు, వడ్డీ కలిపి రూ. 1,41,544.59 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

2015లో కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో 2022 మార్చి వరకు రూ. 87,449.15 కోట్లకు 15 రుణ ఒప్పందాలు చేసుకుంది. ఇందులో నిర్మాణ సమయంలో చెల్లించే వడ్డీ రూ. 11,220.22 కోట్లు ఉందని కాగ్ వర్గాలు తెలిపాయి.

2022 మార్చి వరకు రూ. 64,283.40 కోట్ల రుణాలు ఖర్చు చేశారని కాగ్ తెలిపింది. 15 ఒప్పందాల్లో పదింటికి 2020-21, 2021-22లో తిరిగి చెల్లింపు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం కార్పొరేషన్‌ విజ్ఞప్తితో నాలుగు ఒప్పందాల్లో ఏడాది, 5 ఒప్పందాల్లో రెండేళ్లు వాయిదా వేశాయి బ్యాంకులు. దీంతో అదనపు వడ్డీ రూ. 8182.44 కోట్ల భారం పడుతోందని కాగ్ తాజా నివేదికలో పేర్కొంది.