తొమ్మిదేళ్లలో 3 రెట్లు పెరిగిన ప్రభుత్వ బ్యాంకుల లాభాలు

ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్‌బి) లాభాలు మూడు రెట్లు పెరిగి రూ.1.04 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు ఇదే ఊపును కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభాలు 2014 ఆర్థిక సంవత్సరంలో రూ.36,270 కోట్లుగా ఉండగా 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇవి దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.1.04 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఉత్తమమైన కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలు పాటించడం ద్వారా బ్యాంకులు ఇప్పుడు సాధించిన విజయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని శనివారం పంజాబ్ సింధ్ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభిస్తూ నిర్మలా సీతారామన్ చెప్పారు.

బ్యాంకులు తమ విజయాలను చూసి సంతృప్తి చెందకూడదని, అవి అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను పాటిస్తూ, రెగ్యులేటరీ నిబంధనలను పాటిస్తూ,తెలివైన లిక్విడిటీ నిర్వహణ ఉండేలా చూడడంద్వారా బలమైన అసెట్ లయబిలిటీ, రిస్క్ మేనేజిమెంట్‌ను కలిగి ఉండడంపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

భారత ఆర్థిక వ్యవస్థ రెండు బ్యాలెన్స్ షీట్ల సమస్యనుంచి రెండు బ్యాలెన్స్ షీట్ల అడ్వాటేజికి మారిందని ఆమె చెప్పారు.  2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు హేతుబద్ధం కాని ఫోన్ బ్యాంకింగ్ కారణంగా బ్యాంకింగ్ రంగంలో వాస్తవంగా సమస్య మొదలైందని, యుపిఎ ప్రభుత్వం సమయంలో అది జరిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

అప్పుడు అంతగా అనువుగాని కస్టమర్లకు రుణాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారని, ఫలితంగా అవి నిరరర్థక ఆస్తులు(ఎన్‌పిఎ)లుగా మారాయని ఆమె తెలిపారు. అయితే మోదీ  ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల కారణంగా రెండు బ్యాలెన్స్ షీట్ల సమస్య తొలగిపోయిందని చెప్పడానికి సంతోషిస్తున్నానని నిర్మలా సీతారామన్ చెప్పారు.