లింగమనేని గెస్ట్‌హౌస్ జప్తుకు ఎసిబి కోర్ట్ అనుమతి

కరకట్ట దగ్గర ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్ జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ వేసిన పిటిషన్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. లింగమనేని రమేష్‌కు నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అనంతరం గెస్ట్ హౌస్ జప్తు చేసుకునేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చింది.

లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. దీంతో గెస్ట్‌హౌస్ జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.
కరకట్ట దగ్గర ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌లో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ ఈ గెస్ట్‌హౌస్‌పై అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది. అమరావతి రాజధానిలో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు గతంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని రాక సందర్భంగా భారీ ఎత్తున భూములు కేటాయించిందని సీఐడీ ఆరోపిస్తోంది.
 
అందుకు ప్రతిఫలంగా కృష్ణానది కరకట్టపై ఉన్న తన గెస్ట్ హౌస్ ను లింగమనేని రమేష్ మాజీ సీఎం చంద్రబాబుకు ఇచ్చారని చెబుతోంది. దీన్ని క్విడ్ ప్రోగా పేర్కొంటూ జప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది.  ఈ తీర్పు ద్వారా సీఐడీ వినిపించిన క్విడ్ ప్రోకో వాదనతో కోర్టు ఏకీభవించినట్లయింది.
 
వాస్తవానికి రాజధాని అమరావతిలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం సీఐడీ సాయంతో గత నాలుగేళ్లలో పలు కేసులు నమోదు చేసింది. అయితే ఇందులో ఆశించిన పురోగతి లభించలేదు.  కానీ చంద్రబాబు నివసిస్తున్న గెస్ట్ హౌస్ విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఏసీబీ కోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది.