తెలంగాణకు 600 మంది బిజెపి బూత్ స్థాయి కార్యకర్తలు

మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించాలని బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

 ఇదిలా ఉంటే బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడానికి వివిధ కార్యక్రమాలు చేపడతారు. వీరంతా జులై 5వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉంటారు.

వీరంతా మూడు రైళ్లలో తెలంగాణకు చేరుకుంటున్నారు. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ లో దాదాపు 350 మంది కార్యకర్తలకు బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాజీపేట లో సుమారు 150 మందికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మంచిర్యాలలో మరో 100 మందికి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్యెల్యే మహేశ్వర్ రెడ్డి తదితరులు స్వాగతం పలకనున్నారు.

మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్ లలో మూడు బృందాలుగా విడిపోయి వీరు మేరా పోలింగ్ బూత్.. సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ క్షేత్రస్థాయిలో దూకుడును కొనసాగించడానికి, చరిష్మా ఉన్న నాయకులను తీసుకువచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే హైదరాబాద్ వేదికగా జూలై 8న 11 రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పై సానుకూల ప్రభావం చూపిస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.