సర్వే సంస్థలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు

సర్వే సంస్థలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు ఉండబోతోందని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. బీజేపీ నేతలతో ఫొటో దిగితేనే బీసీ బంధు, దళిత బంధు, ప్రభుత్వ పథకాలు అందవని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ సంక్షేమ పథకాలు రావనే భయంతో బయటకు చెప్పకపోవచ్చని తెలిపారు.

 అయితే, మరోసారి కేసీఆర్ గెలిస్తే మన బతుకులు ఆగమేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అంటూ, స్వేచ్ఛ ఉంటే తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే సచివాలయంలోకి ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ఇంకా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉందని చెబుతూ  తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోందని, తప్పకుండా తెలంగాణ బీజేపీ విజయం సాధిస్తుందని ఈటెల భరోసా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ను కొట్టేది బీజేపీనే అని భరోసా వ్యక్తం చేశారు. ఈసారి కేసీఆర్‌కు ఓటు వేయవద్దని రైతులంతా భావిస్తున్నారని చెబుతూ  తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదని మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని తెలిపారు.

తెలంగాణ మోడల్ దేశానికి అందిస్తానన్న కేసీఆర్ ఇక్కడి ప్రజలకు ఏమిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిందని, పార్టీని వాడవాడలా తీసుకెళుతున్నామని పేర్కొన్నారు.  ప్రగతిభవన్‌లో కేసీఆర్ వేసిన స్కెచ్ వల్లే హుజురాబాద్ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నాని ఈటల రాజేందర్  మండిపడ్డారు.

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్ ముదిరాజ్‌లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, తనను జాగ్రత్తగా ఉండాలని కొన్ని నెలలుగా బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ చెప్పారు. అయితే, గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కే తాను భయపడలేదని చెబుతూ ఈ బెదిరింపులకు భయపడతానా? అని ప్రశ్నించారు.

పార్టీలు మారడం దుస్తులు మార్చుకున్నట్లు కాదు
 
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ పార్టీలు మారడం దుస్తులు మార్చుకున్నంత సులువు కాదని స్పష్టం చేశారు. అన్ని పార్టీల్లో అభిప్రాయభేదాలు సహజమని  చెబుతూ ఇదివరకు తానెప్పుడూ ఓ జాతీయ పార్టీలో పనిచేయకపోవడంతో కొన్ని సమస్యలు ఉండవచ్చని తెలిపారు.
బీఆర్ఎస్ నుంచి తాను బయటకు రాలేదని, గెంటేస్తే వచ్చానని గుర్తు చేశారు. తనను బయటకు పంపించినప్పుడు కేసీఆర్ కుటుంబీకులు కూడా బాధ పడి ఉంటారని చెప్పారు. తనకు తానుగా ఢిల్లీకి వెళ్లలేదని,  అపాయింట్‌మెంట్ కోరలేదని ఈటల స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానన చెబుతూ పిలవకుండా తానెప్పుడూ ఢిల్లీ వెళ్లలేదని తేల్చి చెప్పారు.
తనకు వ్యక్తులపై ఫిర్యాదు చేసే అలవాటు లేదని పేకరోన్తు వ్యక్తిగతంగా ఎవరిపైనా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ తనను బయటకు వెళ్లగొడితే  బీజేపీ అక్కున చేర్చుకుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో విజయ తీరాలను ముద్దాడేది బీజేపీనేనని ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు.