ఒకే రోజు నోయిడాలో 124 ప్రాజెక్టులు ప్రారంభించిన యోగి

ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు తీయిస్తున్న ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నోయిడాతో పాటు గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో ఆదివారం ఒక్కరోజే ఏకంగా 124 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంఖుస్ధాపనలు పూర్తి చేశారు. 
నోయిడా స్టేడియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నోయిడా, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అమథారిటీ ఆధ్వర్యంలో రూ.1,719 కోట్ల విలువైన 124 అభివృద్ధి ప్రాజెక్టులను యోగీ ప్రారంభించారు, అలాగే మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కేబుల్ బ్రిడ్జ్ తరహాలో నిర్మించిన పార్థాల ఫ్లైఓవర్ నుండి వేద్ వాన్ పార్క్ వరకు పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు.
 
జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్థాల ఫ్లైఓవర్ ను రూ.84 కోట్లతో నిర్మించారు. నోయిడా నుండి గ్రేటర్ (పశ్చిమ) వరకు ఎంపీ-3 రహదారిని కలుపుతుంది. ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జ్ తరహాలోనే ఇది కేబుల్ మోడల్ లో నిర్మించారు. ఇది 650 మీటర్ల పొడవుతో క్యారేజ్‌వేకి ఇరువైపులా మొత్తం 28 కేబుళ్లను వాడి నిర్మించారు. సెక్టార్ 78లో వేద్ వాన్ పార్క్ 12 ఎకరాల్లో రూ.22.68 కోట్లతో నిర్మించారు.

 
గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయంలో ‘సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన మరొక కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు. మన సంస్కృతిపై ఏదైనా దాడి జరిగినా లేదా జరుగుతున్నా, అది డిజిటల్ మీడియా లేదా మరేదైనా మాధ్యమం ద్వారా అయినా, దాని విధానం మారిందని యోగీ తెలిపారు.
 
ఆ పద్ధతులను మనం అర్థం చేసుకోవాలని చెబుతూ స్మార్ట్‌ఫోన్‌లలో గేమింగ్ ద్వారా మార్పిడులు చేస్తున్న ఓ గ్యాంగ్ కేసును పోలీసులు తాజాగా గుర్తించారని చెప్పారు.  గతంలో వికలాంగ పిల్లలను లక్ష్యంగా చేసుకునే మరో ముఠాను పోలీసులు ఛేదించారని యోగీ గుర్తుచేశారు. వారు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇచ్చారని, వారి ముఠా పరిధి కేవలం యూపీకే పరిమితం కాలేదని, 25-30 రాష్ట్రాలకు విస్తరించారని తెలిపారు.
 
మత మార్పిడి సంఘటనలు ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే జరగడం లేదని, ఇటీవల ఢిల్లీ, ముంబైలో జరిగిన సంఘటనలు దీనికి ఉదాహరణ అని యోగీ తెలిపారు. 2020లో యూపీలో ఇలాంటి రెండు మూడు ఘటనలు జరిగినప్పుడు తాము ఆర్డినెన్స్ తెచ్చి చట్టం ఆమోదించామని గుర్తు చేశారు.