మణిపూర్ లో 12 బంకర్లు ధ్వంసం

మణిపూర్ లో 12 బంకర్లు ధ్వంసం
మణిపూర్‌లో మైటీస్‌, కుకీస్‌ వర్గాల మధ్య జరుగుతున్న అల్లర్లలో ఆదివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో 12 బంకర్లు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. అలాగే తాము జరిపిన సోదాల్లో పంట పొలాల్లోని పేలుడు పదార్థాలైన ఆరు మోర్టార్‌ షెల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
 
 ఇక గడచిన 24 గంటల్లో తమెంగ్‌లాంగ్‌, ఇంఫాల్‌ ఈస్ట్‌, బిష్ణుపూర్‌, కాంగ్‌పోక్పి, కక్చింగ్‌, చురచంద్‌పూర్‌ జిల్లాల్లో జరిపిన సోదాల్లో బంకర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆదివారం రాత్రి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. చెదురుమదురు సంఘటనలు మినహా పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు ప్రకటన పేర్కొంది.
 
కాగా, సోదాల్లో వరిపొలంలో మూడు 51మి.మీ, మరో 84 మి.మీ మోర్టార్‌ షెల్స్‌ కనుగొన్నారు. బిష్ణుపూర్‌ జిల్లాలోని కంగ్వై, ఎస్‌ కోట్లియన్‌ గ్రామాల సమీపంలో ఒక ఐఇడిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  అయితే బాంబు నిర్వీర్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మోర్టార్‌ షెల్స్‌ని, ఐఈడిని నిర్వీర్యం చేశాయని పోలీసుల ప్రకటన తెలిపింది.
ఇక గత నెలలో మణిపూర్‌లో 1,100 ఆయుధాలు, 13,702 మందుగుండు సామాగ్రి, 250 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి జరుగుతున్న ఈ అల్లర్లలో 120మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు, నివాసాలకు నిప్పు పెట్టినందుకు దాదాపు 135 మంది పోలీసులు అరెస్టు చేశారు.